Syria War: సిరియా నుంచి 75 మంది భారతీయులు సురక్షితంగా బయటకు, లెబనాన్‌‌కు తరలించామని తెలిపిన భారత విదేశాంగ శాఖ

తిరుగుబాటు దళాలు (Syria rebels) సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్‌-అల్‌ అసద్‌ (Bashar Al-Assad) ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

India Evacuates 75 Nationals From Syria (Photo Credits: X/@sidhant)

New Delhi, Dec 11:  సిరియాలో జరుగుతున్న అంత‌ర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తిరుగుబాటు దళాలు (Syria rebels) సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్‌-అల్‌ అసద్‌ (Bashar Al-Assad) ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులపై విదేశాంగ శాఖ అప్ డేట్ ఇచ్చింది. తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్‌ నుంచి లెబనాన్‌ (Lebanon)కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్‌ (యాత్రికులు)లు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్‌ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు పేర్కొంది. అయితే కొంద‌రు భార‌తీయులు ఇంకా సిరియాలోనే ఉండిపోయారు.వాళ్లు డ‌మ‌స్క‌స్‌లో ఉన్న ఎంబ‌సీతో ట‌చ్‌లో ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్‌ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.

సిరియాలో మ‌రో సంక్షోభం, దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అధ్య‌క్షుడు అల్ బ‌షర్, విమానం కూలిపోయింద‌ని ఊహాగానాలు

అస‌ద్ కుటుంబం సుమారు అయిదు ద‌శాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్న‌ది. అయితే రెబ‌ల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం నాయకుడు దేశాన్ని విడిచి వెళ్లారు. సాయుధ తిరుగుబాటుదారులు (Syria rebels) దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్‌ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్‌ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.