Syria, DEC 08: సిరియా (Syria)లో తిరుగుబాటుదళాలు దేశ రాజధాని డమాస్కస్‌పై పట్టుబిగించాయి. దీంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (Bashar al-Assad) దేశాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రష్యా కీలక ప్రకటన చేసింది. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ అల్-అసద్ సిరియాను వీడారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ చర్చల్లో మాస్కో నేరుగా పాల్గొనలేదని తెలిపింది.
సిరియాలో ఆందోళనకర పరిస్థితులు, నాటకీయ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు రష్యా చెప్పింది. సిరియాలో మోహరించిన తమ బలగాలను హైఅలర్ట్‌లో ఉంచామని, ఇప్పటివరకైతే అక్కడి తమ సైనిక స్థావరాల భద్రతకు తీవ్రమైన ముప్పేమీ లేదని తెలిపింది. సిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలై ఉన్నప్పటికీ.. సిరియాలో తన సైనిక స్థావరాలను కొనసాగిస్తోంది.
దాదాపు దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో సతమతమై.. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు ఇటీవల మళ్లీ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఒక్కో నగరాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటూ.. చివరకు దేశ రాజధానిని సైతం స్వాధీనం తీసుకోవడంతో సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోయినట్లయ్యింది. ఈ విషయాన్ని తిరుగుబాటుదారులు వెల్లడిస్తూ.. నిరంకుశ పాలన నుంచి సిరియా విముక్తి పొందిందని ప్రకటించారు. దేశంలో కొత్త శకం ప్రారంభమైందని, విదేశాల్లో ఉన్న సిరియన్లు తిరిగి రావాలని పిలుపునిచ్చారు