Covid in India: హైదరాబాద్‌లో ఇద్దరికి కొత్త కరోనావైరస్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు నమోదు, దేశంలో తాజాగా 16,432 మందికి కరోనా, భారత్‌లో ఆరుమందికి కొత్త కోవిడ్ పాజిటివ్

బ్రిట‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆరుగురిలో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

Coronavirus in TS (Photo Credits: IANS)

New Delhi, December 29: బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ, ఆ దేశం నుంచి తెలంగాణకు చేరుకున్న వారిలో ఇద్దరికీ బ్రిటన్ లో పుట్టిన కొత్త కరోనావైరస్ (New Covid Starin) కోవిడ్ పాజిటివ్ గా నమోదయింది. బ్రిట‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆరుగురిలో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

ఇందులో బెంగ‌ళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మూడు శాంపిళ్లు, హైద‌రాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్‌లో కొత్త ర‌కం వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు తెలిపింది. ఈ ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్లు తెలిపింది. వీళ్ల‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పింది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్‌ కేసులు ( coronavirus pandemic in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కు పెరిగింది. మరో 252 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,48,153కు చేరింది. గడిచిన 24గంటల్లో 24,900 మంది కోలుకోగా.. మొత్తం 98,07,569 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,68,581 ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.

భారత్‌లో మొదలైన కొత్త కరోనావైరస్ కల్లోలం, ఆరుమందికి కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పాజిటివ్, హైదరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్, నెల రోజుల్లో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు

గడిచిన ఆరు నెలల్లో అత్యల్ప సంఖ్యలో కొవిడ్‌ కేసులు (2020 Coronavirus Pandemic in India) నమోదవడం ఇదే తొలిసారి అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. వరుసగా ఎనిమిదో రోజు యాక్టివ్‌ కేసులు మూడు లక్షల కన్నా తక్కువగా ఉన్నాయని, కాసేలోడ్‌లో 2.63 శాతం ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 95.92శాతాని చేరుకుందని, కొవిడ్‌ మరణాల రేటు 1.45శాతంగా ఉందని వివరించింది.

తెలంగాణలో గత 24 గంటల్లో 397 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 397 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 627 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,77,931 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,535కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,999 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,838 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి.

యూకే నుంచి వచ్చిన వారిలో 156 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 1,216 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 156 మంది ఆచూకీ తెలియరాలేదు. అలాగే, వచ్చిన వారిలో ఆరుగురు ఇతర దేశాలకు వెళ్లిపోగా, 58 మంది ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ సమాచారం అందించింది. అలాగే, ఇప్పటి వరకు 996 మందికి పరీక్షలు నిర్వహించారు. 21 మందికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. దీంతో వీరి నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపగా, వరంగల్‌కు చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.

కరోనా పాజిటివ్‌గా తేలిన 21 మందిలో మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారు 9 మంది, హైదరాబాద్‌కు చెందిన వారు నలుగురు, జగిత్యాలకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా కొత్త వైరస్‌ను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు.