Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ ఆలయంపై దాడిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని జస్టిన్ ట్రూడోకు పిలుపు
దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు.
New Delhi, Nov 4: కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు.ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడాకు పిలుపునిచ్చింది.
హింసకు పాల్పడే వారిపై విచారణ జరుగుతుందని కూడా మేం భావిస్తున్నాం. భారత ప్రభుత్వం.. కెనడా దేశంలో భారత పౌరుల భద్రత, భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉంది. భారతీయ, కెనడియన్ పౌరులకు కాన్సులర్ సేవలను అందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించాం’’అని తెలిపారు.
కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంలో దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కెనడాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు’’ అని జైస్వాల్ అన్నారు.
కాగా బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రాంతీయ పోలీసులన ట్రూడో ఆదేశించారు.
ఈదాడి ఘటనపై బ్రాంప్టన్ మేయర్ తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయం వెలుపల జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.
మరోవైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్య స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందన్నారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.