A screengrab of the video shows Khalistani extremists attacking Hindu devotees inside the premises of Hindu Sabha temple. (Photo credits: X/@AryaCanada)

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. గతేడాది విండ్‌సోర్‌లోని ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా పరిగణించారు.

అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈనేపథ్యంలో బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు.ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రాంతీయ పోలీసులన ట్రూడో ఆదేశించారు.

కెనడాలో టెస్లా కార్లు ఢీకొని ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటల్లో నలుగురు భారతీయులు సజీవ దహనం

ఇలా వరుస దాడులతో కెనడాలోని హిందువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈదాడి ఘటనపై బ్రాంప్టన్‌ మేయర్‌ తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయం వెలుపల జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.

Khalistani Extremists Attack Devotees Outside Hindu Sabha Temple in Brampton

కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఘటనపై స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందన్నారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోకి కూడా చొరబడ్డాయని ఆయన ఆరోపించారు. మరో ఎంపీ కెవిన్‌ వూంగ్‌ స్పందిస్తూ తీవ్రవాదులకు కెనడా సురక్షిత ప్రదేశంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘హిందువులు, క్రిస్టియన్లు, యూదులను రక్షించడంలో మన నాయకులు విఫలమయ్యారు’’ అని పేర్కొన్నారు.

ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తచేసింది. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంప్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం తీవ్ర నిరాశపరిచిందని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ వ్యాఖ్యానించింది. దీనివెనక భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భద్రత అందించాలని మేం ముందుగానే కెనడా అధికారులను అభ్యర్థించాం. భారత వ్యతిరేక శక్తుల దాడితో మా క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఇలాంటి చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. భారత పౌరుల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వాంకోవర్‌లో కూడా నవంబర్ 2-3 తేదీల్లో ఇదే తరహా యత్నాలు జరిగినప్పటికీ.. మా కార్యకలాపాలు కొనసాగించగలిగాం’’ అని హై కమిషన్ ఎక్స్ వేదికగా స్పందించింది.