Coronavirus in India: టీకా తీసుకున్నా..అమెరికాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్, వేగంగా పెరుగుతున్న కేసులు, బ్రిటన్‌లో టీకా తీసుకున్న వారికి సోకుతున్న ప్రమాదకర డెల్టా వేరియంట్‌, దేశంలో తాజాగా 39,070 కరోనా కేసులు నమోదు

ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. దేశంలో మొత్తం కరోనాతో 4,27,862 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,10,99,771 మంది రికవరీ అయ్యారు.

Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, August 8: దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 491 మంది మృతి (COVID 19 deaths) చెందారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. దేశంలో మొత్తం కరోనాతో 4,27,862 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,10,99,771 మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 50.68 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ (Health Ministry, India) విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది.

అమెరికాలో 70 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్‌ (Coronavirus Vaccination) వేయించుకున్నప్పటికీ కేసుల పెరుగుదల కలవరపెడుతున్నది. జూన్‌ చివర్లో అమెరికాలో రోజుకి సగటున 11 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష (1,07,143) దాటింది. అమెరికాలో గత నవంబర్‌లో రోజువారీ సగటు కేసులు లక్ష నమోదయ్యాయి. అప్పట్లో ఆ సంఖ్యను చేరడానికి ఆరు నెలలు పట్టింది. జనవరికల్లా 2.5 లక్షలకు చేరింది. జూన్‌లో కేసులు తగ్గినప్పటికీ ఆరు వారాల్లోపే మళ్లీ పెరిగాయి. రోజుకి సగటున నమోదయ్యే కేసులు లక్ష మార్కును దాటాయి. కరోనా మరణాలు కూడా పెరిగాయి.

కరోనా థర్డ్ వేవ్..ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్, 132 దేశాలకు పాకిన ప్రమాదకర వైరస్, ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి, దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

గత రెండు వారాలుగా రోజుకి 500 మరణాలు సంభవిస్తున్నాయి. అంతకుముందు అవి 270 ఉండేవి. వ్యాక్సిన్‌ వేయించుకోని వారి ద్వారా కరోనా వేగంగా వ్యాపిస్తున్నదని నిపుణులు పేర్కొన్నారు. ‘ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయకపోతే జనవరిలో మాదిరిగా కరోనా కేసులు ఇంకా పెరిగిపోతాయని అమెరికా సీడీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా బారినపడి ప్రజలు మరణిస్తుండటం విషాదకరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావని చెప్పారు. గత 9 నెలలుగా కరోనా మరణాలు 90 శాతం తగ్గినప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు.

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, ఆగస్టు 31 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడిగింపు, అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

బ్రిటన్‌లో వందలాది మంది టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ (Delta Variant) సోకినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టీకాలు వేసిన వ్యక్తులకు కూడా డెల్టా వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని ఇంగ్లండ్‌ పబ్లిక్ హెల్త్ అధికారులు చెప్పారు. టీకా వేసుకున్న వ్యక్తుల్లో ఈ వైరస్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలాగే వేగంగా వ్యాప్తి చెందుతాయని సంస్థ హెచ్చరించింది. కొవిడ్‌ ఆంక్షలను సడలింపు ఇచ్చిన తర్వాత, డెల్టా వేరియంట్ కేసులు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి.

జులై 19 నుంచి ఆగస్టు 2 వరకు డెల్టా ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరిన 1,467 మందిలో 55.1 శాతం మందికి టీకా అందలేదని, అలాగే, 512 మంది (34.9 శాతం) రెండు డోసుల టీకాను పొందారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది. జూలై 19 న ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు. ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఫైజర్-బయోటెక్‌ల టీకాలు ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు, యూకేలో ఆడల్ట్‌ జనాభాలో 75 శాతం మంది రెండు మోతాదుల టీకాను పొందినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.