Geneva, July 31: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా (Delta Is A Warning) మారింది., ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అన్ని దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే కరోనా మహమ్మారిని అదుపు చేయాలన్న హెచ్చరిక జారీ చేస్తోందని వ్యాఖ్యానించింది. కరోనాను అంతం చేసే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
తొలుత భారత్‌లో వెలుగులోకి వచ్చిన ఈ డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు 132 దేశాలకు పాకింది. ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. ఒకవేళ వైరస్ ఇలాగే రూపాంతరం చెందుతూ వెళితే.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు ఉద్భవిస్తాయని హెచ్చరించారు. గత నాలుగు వారాల్లో సగటున 80 శాతం కేసులు (Delta Variant Cases)పెరిగాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే భారతదేశ వ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus variant) కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు వెల్లడించారు. దేశంలో SARS-CoV-2 యొక్క జన్యు శ్రేణిని పర్యవేక్షించే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ISACOG) ఈ మేరకు గుర్తించినట్లు తెలిపారు.
దేశంలోని 28 ప్రయోగశాలల్లో కరోనా వేరియంట్లకు సంబంధించిన 58,240 నమూనాలను ISACOG పరీక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వీటిలో 46,124 నమూనాలను జన్యుపరంగా విశ్లేషించినట్లు వివరించారు. 4172 నమూనాలు ఆల్ఫా వేరియంట్, 217 నమూనాలు బీటా వేరియంట్, ఒక నమూనా గామా వేరియంట్, 17,169 నమూనాలు డెల్టా వేరియంట్, 70 డెల్లా ప్లస్ వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడించారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడులో 10, మధ్యప్రదేశ్‌లో 11, చండీగఢ్‌లో నాలుగు, కేరళ, కర్ణాటకలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో రెండు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు వివరించారు.
ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం.. వంటి పనులను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ సైతం సమర్థంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల డోసులు పంపిణీ చేశారు. వీటిలో ప్రపంచ బ్యాంకు గుర్తించిన ధనిక దేశాల్లో ప్రతి 100 మందిలో 98 డోసులు పంపిణీ అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఆదాయపరంగా అట్టడుగున ఉన్న 29 దేశాల్లో మాత్రం ప్రతి 100 మందిలో 1.6 డోసులు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపింది.
ఈ సెప్టెంబరు కల్లా ప్రతి దేశం.. అక్కడి జనాభాలో 10 శాతం మందికి, ఈ ఏడాది చివరికి 40 శాతం మందికి, వచ్చే సంవత్సరం మధ్యనాటికి 70 శాతం మందికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది. కానీ, ప్రస్తుతం వ్యాక్సినేషన్ సాగుతున్న తీరును బట్టి చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాల్లో కేవలం సగం మాత్రమే వాటి జనాభాలో 10 శాతం మందికి పూర్తిస్థాయి డోసులు అందించాయని తెలిపారు. బురుండి, ఎరిత్రియా, ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని పేర్కొన్నారు.