COVID-19 in India: దేశంలో కనుమరుగవుతున్న సెకండ్ వేవ్, కొత్తగా 60,471 మందికి కోవిడ్, 2,726 మంది మృతి, దేశంలోకి మరో వ్యాక్సిన్ ఎంట్రీ, అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న జైడస్ క్యాడిలా జైకోవ్-డీ వ్యాక్సిన్
అయితే నిన్న మూడువేల దిగువనే మరణాలు నమోదవడం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మృతి (Covid Deaths) చెందారు.
New Delhi, June 15: దేశంలో సోమవారం 17,51,358 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..60,471 మందికి (COVID-19 in India) పాజిటివ్‌గా తేలింది. అయితే నిన్న మూడువేల దిగువనే మరణాలు నమోదవడం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 2.9కోట్లకు పైబడగా..3.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38కోట్లకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 9,12,378 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,17,525 మంది కోలుకోగా.. రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. మొత్తంగా 2.82కోట్ల మందికిపైగా వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోపక్క నిన్న 39,27,154 మంది కరోనా టీకా వేయించుకున్నారు. నిన్నటి వరకూ 25.90 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.
అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్‌గానూ నిలువనుంది. వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా.. మరొకటి స్వదేశీ టీకా. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వీ టీకాలు రెండు డోసులు కాగా.. జైకోవ్ డీ వ్యాక్సిన్ మూడు డోసులు.
మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో మోతాదు, మూడో మోతాదు 56 రోజుల తర్వాత వేయనున్నారు. జైకోవ్-డీ డీఎన్‌ఏ ప్లాస్మిడ్ వ్యాక్సిన్ కాగా.. 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చు. కంపెనీ 200 మిలియన్ మోతాదులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు భాగస్వాములతో కలిసి పని చేస్తున్నది. ఆగస్ట్ – డిసెంబర్ మధ్య 50 మిలియన్ల జైకోవ్-డీ టీకాల లభ్యత ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.