Covid in India: కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే వారి జాబితాలో చనిపోయిన వారి పేర్లు, 14 రోజుల తర్వాతనే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం, వెల్లడించిన ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 15,968 కొత్త కేసులు నమోదు
తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు (Coronavirus Outbreak in India) పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది.
New Delhi, January 13: దేశంలో గడిచిన 24 గంటల్లో 15,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ( New Covid in India) రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు (Coronavirus Outbreak in India) పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది.
మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,51,529కు (Covid Deaths) చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో మంగళవారం ఒకే రోజు 8,36,227 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది. ఇప్పటి వరకు 18,34,89,114 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వివరించింది.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుందని, రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాతనే టీకా ప్రభావం కనిపిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాబట్టి కరోనా నిబంధనలను కొనసాగించాలని వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన రెండు టీకాలూ సురక్షితం, సమర్థవంతమని, వీటిపై సందేహాలు అక్కర్లేదని చెప్పారు.
మొదటి దశ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన జాబితాలో మరణించిన నర్సు, రిటైర్డు నర్సుల పేర్లు చేర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లాలో వెలుగుచూసింది. అయోధ్యలో మొదటివిడత కరోనా టీకాల పంపిణీ చేయాల్సిన జాబితాను రూపొందించడంలో పలు లోపాలు తలెత్తినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఫ్రంట్ లైన్ కార్మికులైన ఆరోగ్యశాఖ ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందికి మొదటి విడత కరోనా నివారణ టీకాలు వేయనున్నారు.
అయోధ్య నగరంలోని డఫెరిన్ హాస్పిటల్ లో యూపీ ఆరోగ్య శాఖ రూపొందించిన మొదటి విడత టీకాలు వేయాల్సిన జాబితాలో మరణించిన నర్సు, పదవీ విరమణ చేసిన నర్సుల పేర్లను పొందుపర్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొవిడ్ టీకాల పంపిణీ జాబితాలో తప్పులు దొర్లడంపై యూపీ ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా మూడు నెలల క్రితం తయారు చేసిన జాబితా కావడంతో ఇలా జరిగిందని, దీన్ని నవీకరిస్తామని అయోధ్య అధికారులు చెప్పారు. జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్ కార్యక్రమంలో జనవరి 16వతేదీన యూపీలోని 852 కేంద్రాల్లో ప్రారంభం కానుంది.