Covid in India: ఇండియాను మళ్లీ వణికిస్తున్న కరోనావైరస్, గత 24 గంటల్లో 40,953 మందికి కోవిడ్, ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నామని ప్రకటించిన పంజాబ్ సర్కారు, మహారాష్ట్రకు బస్సులు నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్తగా 23,653 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కు (Coronavirus in India) చేరింది.
New Delhi, Mar 20: దేశంలో గత 24 గంటల్లో 40,953 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్తగా 23,653 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,558కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,07,332 మంది కోలుకున్నారు. 2,88,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,20,63,392 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం (Punjab Govt) కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వైద్య, నర్సింగ్ కళాశాలలను అందుకు మినహాయించారు. కరోనా కట్టడి కోసం రానున్న 2 వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
అటు, సినిమా హాళ్లలో సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, షాపింగ్ మాల్స్ లో ఏ సమయంలోనైనా 100 మందికి మించి ఉండరాదని సర్కారు నిబంధనలు విధించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పదకొండు జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడమే కాకుండా, అదనంగా మరో రెండు గంటల పాటు పొడిగించాలని నిర్ణయించింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మంది వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రజలు గుమికూడడంపై ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నిషేధం విధించారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులను నిర్బంధంలో వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లా యంత్రాంగానికి సూచించింది. వైరస్ వ్యాప్తి ప్రభావితమైన జిల్లాల్లో గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిని, సాగర్, బేతుల్, బుర్హాన్‌పూర్, ఖార్గోన్, రత్లం, చింద్వారా జిల్లాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు విధించారు.
భారీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఇండోర్, భోపాల్, జబల్‌పూర్‌లో ఆదివారం మధ్యప్రదేశ్‌లో హోంశాఖ లాక్‌డౌన్ విధించింది. దీంతో ఈ మూడు నగరాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ నెల 31వ వరకు మూసివేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలను కర్ఫ్యూ నుంచి మినహాయించారు. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 1,140 కొత్త కొవిడ్ కేసులు నమోదవగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,097కి పెరిగింది.
మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,833 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు వెయ్యికిపైగా కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఈ నెలాఖరు వరకు డ్రామా థియేటర్లు, ఆడిటోరియంలు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే వైద్య, ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు సంబంధించినవి మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే నడువాలని స్పష్టంచేసింది.
మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ర్టాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని మొత్తం కేసుల్లో ఈ రాష్ర్టాల వాటానే 80 శాతానికిపైగా ఉన్నట్టు తెలిపింది. 65% పైగా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.