Covid in TS: తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన యాక్టివ్ కేసులు, తాజాగా 364 మందికి కరోనా, కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన కేసీఆర్ సర్కారు
Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, Mar 20: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 364 కరోనా కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది (Corona in TS) కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,451 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,666గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,607 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 980 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 75 మందికి క‌రోనా సోకింది.

తెలంగాణ లో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులలో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో తోటి అర్చకుల్లో, సిబ్బందికి, భక్తుల్లో ఆందోళన నెలకుంది. పదిహేను రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ వంశీ తెలిపారు. ఆలయ అర్చకులు కరోనా వైరస్ సోకడంతోనే భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలో కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 11న ప్రైవేటు ఆస్పత్రుల్లోని కొవిడ్‌ వార్డుల్లో 775 మంది చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం వారి సంఖ్య 1,046కు పైగా చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90 శాతం లక్షణాలు లేనివేనని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి కేసులు 70 శాతం ఉండేవని.. ప్రస్తుతం పరిస్థితి మారిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఇలాంటివారితోనే వ్యాప్తి ఎక్కువని పేర్కొంటున్నాయి. తాజా పాజిటివ్‌లలో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని వివరించాయి. పొడి దగ్గు, జ్వరం, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలున్నవారిలో వైరస్‌ బయటపడుతున్నట్లు తెలిపాయి. ఈ లక్షణాలున్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని, యాంటీజెన్‌లో నెగిటివ్‌ వస్తే, ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు

రాష్ట్రంలో కోటి మందికి కరోనా టీకాలు వేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. అయితే 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సాధారణ వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్‌ వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకావేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 8.75 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారు. వాస్తవంగా ఈ నాలుగు కేటగిరీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మందికి టీకా వేయాలనుకున్నారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు దాదాపు 6 లక్షలు కాగా, 10 లక్షల మంది 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 54 లక్షల మంది ఉన్నారు. వీరుకాక 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 30 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.

రాష్ట్రంలో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం మొత్తం కోవిడ్‌తో అతలాకుతలమైందని, ఆదాయాలు తగ్గిపోయినప్పటికీ, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడానికి భారీగా వ్యయం చేసినట్లు శాసనసభకు సమర్పించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,177 కోట్లు వ్యయం చేయగా, ఆçహార భద్రతా కార్డులున్న వారికి ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున రెండు దఫాలు మొత్తం రూ. 2,628 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే రేషన్‌ కోసం రూ. 1,103 కోట్లు, వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి వీలుగా రూ.124 కోట్లు, కోవిడ్‌ వారియర్స్‌గా ఉన్న వైద్య, మునిసిపల్, పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.182 కోట్లు, పోలీసులకు రూ.54 కోట్లు సాయం అందించినట్లు వివరించింది.