Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులు చూసి భారత్ ఆ పాఠాలు నేర్చుకోవాలి, కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్‌ఎస్‌జీ చీఫ్ ఎంఏ గణపతి
ఈ నేపథ్యంపై ఎన్‌ఎస్‌జీ (NSG) డీజీ ఎంఏ గణపతి (M.A. Ganapathy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడులు సంభవిస్తే తక్షణమే స్పందించేలా భారత్ సంక్షోభ నిర్వహణ ప్రతిస్పందన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు
India must learn from unprecedented attack on Israel: ఇజ్రాయెల్‌పై (Israel) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఆకస్మిక ఉగ్రదాడి చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంపై ఎన్‌ఎస్‌జీ (NSG) డీజీ ఎంఏ గణపతి (M.A. Ganapathy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడులు సంభవిస్తే తక్షణమే స్పందించేలా భారత్ సంక్షోభ నిర్వహణ ప్రతిస్పందన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు.ఢిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌జీ రైజింగ్ పరేడ్ వేడుకల్లో డీజీ ఎంఏ గణపతి మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా.. పోరులో అంతిమ విజయానికి మనిషి, ఆయుధం కారణమవుతాయని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల ముప్పేట దాడిని ఊహించలేమని, అధునాత సాంకేతిక సదుపాయాలున్న రాడార్ వ్యవస్థ ఉన్నప్పటికీ వారు భీకర దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ‘ఇక్కడ మనం రెండు పాఠాలు నేర్చుకోవాలి. బీభత్సమైన ఉగ్రదాడులు జరిగితే తక్షణమే స్పందించడానికి సంక్షోభ నిర్వహణ ప్రతిస్పందన ఫ్రేమ్‌వర్క్ మనకు ఉండాలి. సాంకేతికతపై ఆధారపడటం తప్పని సరి అని తెలిపారు.
అయితే, నైపుణ్యవంతులైన సిబ్బంది దాన్ని వినియోగించేలా చూడాలి. మన సిబ్బంది నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించాలి. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో వారిదే కీలక పాత్ర. మనిషి, ఆయుధమే యుద్ధంలో చివరిపోరులో కీలకశక్తులని గ్రహించాలి’ అన్నారు. ఎన్‌ఎస్‌జీ ప్రధానంగా అర్బన్ యాంటీ టెర్రర్ ఫోర్స్ అయినప్పటికీ దండకారణ్యాల్లో జరిగే ఆపరేషన్లలోనూ పాలుపంచుకుంటోందని చెప్పారు. జాతీయ స్థాయిలో ఐఈడీ మేనేజ్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారి ఒకరు హాజరు కావాల్సి ఉంది. డ్రోన్లు, మానవ రహిత వైమానిక వ్యవస్థ అంశాలపై ఆయన ప్రసంగం కూడా సిద్ధమైంది. అయితే, తమ దేశంపై హమాస్ ఉగ్రవాదులు దాడి జరిగిన నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.