ఇజ్రాయెల్‌పై హమాస్ (Israel-Hamas) దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. దీన్ని అత్యంత పాశవికమైన దాడిగా అభివర్ణించిన ఆయన.. జీవితంలో అత్యంత ఘోర కలిని చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసే చర్యలకు పాల్పడవద్దని పనిలో పనిగా ఇరాన్‌కూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే హమాస్‌కు మద్దతుగా ఉన్న ఇరాన్‌ను సైతం హెచ్చరించినట్లు బైడెన్ వారికి వెల్లడించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేయొద్దని.. ఈ విషయానికి దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిపారు.ఇజ్రాయెల్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో నిరంతరం వాకబు చేస్తున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. యూదు ప్రజల భద్రతకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనికోసం నిరంతరం ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు.
Here's Video
NOW - Biden: "I never really thought that I would see, have confirmed pictures of terrorists beheading children." pic.twitter.com/hgqGJo0Xqt
— Disclose.tv (@disclosetv) October 11, 2023
హమాస్ దాడిలో దాదాపు 22 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయినట్లు శ్వేతసౌధం బుధవారం ప్రకటించింది. మరో 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవన్ తెలిపారు. హమాస్ చేతిలో కొంత మంది బందీలుగా కూడా ఉన్నారని చెప్పారు. అయితే, బందీలను విడిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని అంతకుముందు బైడెన్ కూడా వెల్లడించారు. దానికోసం ప్రత్యేకంగా నిపుణులు పనిచేస్తున్నారన్నారు.