Heatwave Warning: జాగ్రత్తగా ఉండాల్సిందే, తెలుగు రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్, మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన ఎఐండి
పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
New Delhi, April 18: ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు (IMD) జారీ చేసింది.
ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ఇక సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.గంగానది, పశ్చిమ బెంగాల్ బీహార్‌లో నాలుగు రోజుల పాటు వేడి తరంగాలు (India Sizzles At 40 Degrees Celsius)వీచవచ్చునని ఐఎండీ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)తో పాటు దాని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బుధవారం వరకు వేడిగాలులు (Heat Wave) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఢిల్లీలోనూ హీట్ వేవ్ పరిస్థితులు వరుసగా రెండో రోజు కొనసాగాయి. కొన్ని వాతావరణ స్టేషన్లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు.
పంజాబ్, హర్యానాలలో కూడా వేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానాలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడిగాలులు వ్యాపించాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఛండీగఢ్‌లో వేడి తీవ్రత అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్, బన్స్వారాలో 42.1 డిగ్రీలు, కరౌలీలో 41.4 డిగ్రీలు, అల్వార్‌లో 41.9 డిగ్రీలు, కోటాలో 41.2 డిగ్రీలు, పిలానీలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐంఎడీ వెల్లడించింది.