Hyd, April 17: హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.
కాగా ఈ రోజు నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి ఇలా పలు ప్రాంతాల్లో.. భారీ వర్షం పడింది.తెలంగాణ హైకోర్టు పరిసర ప్రాంతాల్లొ భారీగా వడగండ్ల వాన కురిసింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. నగర శివారుతో పాటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది.
నగరాన్ని మేఘాలు కమ్మేయడంతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎండ వేడితో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వేడి ఉపశమనం పొందారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.