COVID-19 Vaccine: కరోనావైరస్ బలహీనం అయిందనుకోవద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే, పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కరోనా టీకా (COVID-19 Vaccine) వస్తే దాని పంపిణీకి సంబంధించిన అంశాలపై ఆయన ప్రణాళికను ఈ వీడియో కాన్పరెన్స్ లో సమీక్షించారు. అందరి కలిసి కట్టు ప్రయత్నాల వల్ల దేశంలో కరోనా రికవరీ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు మోదీ (PM Narendra Modi) చెప్పారు.
New Delhi, November 24: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో ఆయన కరోనా అంశంపై చర్చించారు. కరోనా టీకా (COVID-19 Vaccine) వస్తే దాని పంపిణీకి సంబంధించిన అంశాలపై ఆయన ప్రణాళికను ఈ వీడియో కాన్పరెన్స్ లో సమీక్షించారు. అందరి కలిసి కట్టు ప్రయత్నాల వల్ల దేశంలో కరోనా రికవరీ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు మోదీ (PM Narendra Modi) చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెంచేందుకు దృష్టి పెట్టినట్లు ప్రధాని తెలిపారు. మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటళ్లలో తగినంత ఆక్సిజన్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 160 ఆక్సిజన్ జనరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. శాస్త్రీయ ప్రమాణాలతో సురక్షితంగా ఉన్న కరోనా టీకాను మాత్రమే దేశ ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై జరుగుతున్న అన్ని అంశాలను ట్రాక్ చేస్తున్నామని, భారతీయ టీకా అభివృద్ధిదారులు, ఉత్పత్తిదారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ రెగ్యులేటర్లతోనూ టచ్‌లో ఉన్నామని, ఇతర దేశ ప్రభుత్వాలతో, బహుళజాతి సంస్థలతో, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రతి ఒక పౌరుడికి వ్యాక్సిన్ అందించడం కోసం జాతీయ మిషన్ చేపడుతామన్నారు. అయితే ఈ మిషన్ సక్సెస్ కావాలంటే, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వ్యూహాత్మకంగా, స్మూత్‌గా, నిరంతర ప్రక్రియలా ఈ మిషన్‌ను చేపట్టాలని మోదీ అన్నారు.
ప్రస్తుతం టీకా అభివృద్ధి జరుగుతున్నా.. ఆ టీకాలు ఎన్ని డోసులు ఉంటాయో తెలియవని, కరోనా టీకా ఒక డోసా లేక రెండు డోసులా లేక మూడు డోసుల్లో వస్తుందా ఇప్పుడే చెప్పలేమని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌కు ఇంకా ధరను కూడా నిర్ధారించలేదన్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదని, కానీ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన కార్యాచరణ మాత్రం రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ భద్రతతో పాటు వేగం కూడా ప్రాముఖ్యమైందని, వ్యాక్సిన్ పంపిణీ విధానానికి అన్ని రాష్ట్రాల సహకారంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని మోదీ సూచించారు.
అతి సూక్ష్మస్థాయిలోనూ ఎలా వ్యాక్సిన్ పంపిణీ (Vaccine Distribution Strategy) చేపడుతారో.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పూర్తి ప్రణాళికలను పంపించాలని సీఎంలను ప్రధాని కోరారు. మీరు అనుభవపూర్వకంగా ఇచ్చే అమూల్యమైన అభిప్రాయాలు.. తాము నిర్ణయం తీసుకోవడంలో దోహదపడుతుందని మోదీ అన్నారు. ప్రో యాక్టివ్ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామన్నారు. టీకా అభివృద్ధి ప్రక్రియ జరుగుతుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం వహించరాదు అని సీఎంలను మోదీ కోరారు.
అయితే ప్రస్తుతం రికవరీ రేటు బాగుందని, కానీ దాన్ని బట్టి వైరస్ బలహీనంగా ఉందని అనుకోవడం సరికాదు అని ప్రధాని మోదీ తెలిపారు. వైరస్ బలహీనంగా ఉందని ప్రజలు అజాగ్రత్తతో మెలుగుతున్నారని, దీన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని ఆయన సీఎంలను ఉద్దేశించి తెలిపారు. వైరస్ సంక్రమణను అడ్డుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కరోనా వైరస్ పాజిటివ్ రేటును 5 శాతం లోపుకు తీసుకురావాలని ఆయన సీఎంలను ఉద్దేశించి తెలిపారు.