COVID-19 Third Wave: యూరప్ దేశాల్లో కరోనా కల్లోలం, 2వ దశ దాటి 3వ దశలోకి కోవిడ్-19, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
coronavirus in idnia (Photo-PTI)

Switzerland, Nov 24: కరోనావైరస్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ యూరప్‌ దేశాలను (European Countries) వణికిస్తోంది. అక్కడ కరోనా మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి (Coronavirus Second Wave) ఇప్పటికే చేరింది. ఇక మూడవ దశలోకి (COVID-19 Third Wave) వెళ్లేందుకు రెడీ అవుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత (Covid Deaths) పడుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా తదితర దేశాలు కోవిడ్-19 దెబ్బకు బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్‌ దేశాలు (Europe Countries) అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి డేవిడ్‌ నబార్రో చెప్పారు. స్విట్జర్లాండ్‌లో మీడియాతో మాట్లాడిన డేవిడ్‌ నబార్రో కరోనాపై ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే ప్రమాదముందని, ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

కరోనా చికిత్సకు ఉపయోగించే రెమిడిసివిర్‌ సస్పెండ్, దాంతో ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో, అమెరికా జూనియర్ ట్రంప్‌కి కోవిడ్ పాజిటివ్

మొదటి దశలో కరోనాని నియంత్రించగలిగినా రెండవ దశను ఎదుర్కోవడంలో యూరప్ దేశాలు విఫలం అయ్యాయని అందువల్లనే కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్‌ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని, దీని వల్ల మూడవ దశలో అది పెను ప్రమాదాలను అందించే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లోనూ మేల్కోకపోతే థర్డ్‌ వేవ్‌ మరింత భీకరంగా ఉంటుందని తెలిపిన నబార్రో.. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్ ధర రూ.1000, ప్రకటించిన సీరం ఇన్‌‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి

ఇక ఆసియా దేశాలపై డేవిడ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ దేశాలను చూసి యూరప్ దేశాలు చాలా నేర్చుకోవాలని కోరారు. దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని, అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. పలు ఆసియా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను అర్ధాంతరంగా నిలిపి వేయకుండా కరోనా అదుపులోకి వచ్చేదాకా కొనసాగించాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. యూరప్‌లో అలాంటి సన్నద్ధత కనిపించలేదని డేవిడ్‌ నబార్రో తెలిపారు.

ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్‌లో శనివారం ఒక్కరోజే 33 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో నిత్యం వేలాదిగా కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. టర్కీలో తాజాగా 5,532 కొత్త కేసులు బహిర్గతమయ్యాయి. బ్రిటన్‌ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 2వ తేదీన ముగియనుంది. దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండడంతో లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. సాధారణ ఆంక్షలే విధించనున్నట్లు సమాచారం. బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అమెరికా, ఫ్రాన్స్, మెక్సికో సహా వివిధ ఐరోపా దేశాల్లో సెకండ్‌వేవ్‌లో కేసుల తీవ్రత పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పాటు పశ్చిమదేశాల్లోని వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్‌ చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన మందులు పనిచేయట్లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ‘మాస్క్‌ మాత్రమే వ్యాక్సిన్‌’అని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్‌ను నిర్లక్ష్యం చేసిన దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. సెకండ్‌వేవ్‌ కుదుపునకు గురైన ఐరోపా దేశాల్లో ప్రస్తుతం ప్రతీ 17 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. అదే మాస్క్‌ల వాడకంలో ముందున్న తైవాన్‌ ఇతర ఆసియా దేశాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

ఐరోపా నుంచి వస్తున్న నివేదికలను బట్టి సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. గత వారంలోనే 29 వేల మంది చనిపోయారు. ఇప్పటికే మెక్సికోలో లక్ష మందిపైగా మత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. భారత్‌లో సెకండ్‌వేవ్‌ తీవ్రంగా వస్తే అది సునామీగా మారే ప్రమాదముంది. ఢిల్లీ, ముంబై తదితర చోట్ల కేసులు పెరుగుతున్నాయి. హాస్పటల్స్‌లో బెడ్స్‌ మళ్లీ నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల అడ్మిట్‌ అయ్యేందుకు పేషెంట్లు వేచిచూడాల్సిన పరిస్థితులున్నాయి. సాధారణ ప్రజలు వైరస్‌ ప్రభావం తగ్గిపోయిందనే భావనలో ఉన్నారు. అది చాలా తప్పని తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.