Indo-China Border: సరిహద్దులో మళ్లీ బరితెగిస్తున్న చైనా, తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరింపు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్దమని తెలిపిన భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె
సరిహద్దులో చైనా మళ్లీ తన కార్యకలాపాలను యాక్టివ్ చేసింది. తన సైన్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని (Increase in Chinese Deployment Matter of Concern) భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె తెలిపారు.
Leh, October 2: సరిహద్దులో చైనా మళ్లీ తన కార్యకలాపాలను యాక్టివ్ చేసింది. తన సైన్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని (Increase in Chinese Deployment Matter of Concern) భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని చెప్పారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్ వెళ్లిన ఆయన (General Manoj Mukund Naravane) అక్కడి ఫార్వర్డ్ శిబిరాలను పరిశీలించారు. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని లద్దాఖ్ పర్వతశ్రేణుల్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఖాదీ మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నరవణె.. భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. ‘‘గత ఆరు నెలలుగా సరిహద్దుల్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 12 సార్లు ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయి. త్వరలోనే 13వ రౌండ్ సమావేశం జరగనుంది.
అయితే గత కొన్ని రోజులుగా తూర్పు లద్దాఖ్, ఉత్తర ఫ్రంట్ ప్రాంతాల్లో చైనా గణనీయంగా బలగాలను మోహరిస్తోంది.తాజాగా గాల్వన్ ఏరియా, పాంగాంగ్ సో ఇరు తీరాల నుంచి తన దళాలను ఉపసంహరించుకుంది. గోగ్రా నుంచి దళాలు వెనుకకు వెళ్తున్నాయి. మరోవైపు తూర్పు లడఖ్ ప్రాంతానికి అత్యాధునిక ఆయుధాలను పీఎల్ఏ తరలిస్తోంది. సెల్ఫ్ ప్రొపెల్డ్ మోర్టార్స్, పీహెచ్ఎల్-03 లాంగ్ రేంజ్ మల్టిపుల్ రాకెట్ లాంఛర్స్ వంటివాటిని ఇక్కడికి చేర్చుతోంది.
అంతకుముందు టైప్-15 లైట్ బ్యాటిల్ ట్యాంక్స్, జెడ్‌టీజెడ్-99 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, పాత తరం జెడ్‌టీజెడ్-88లను తూర్పు లడఖ్ ప్రాంతానికి తీసుకొచ్చింది. పాంగాంగ్‌లో దాదాపు 100 చైనీస్ ట్యాంకులు ఉన్నాయి. జెడ్-8 హెలికాప్టర్లు, పెద్ద ఎత్తున నిఘా పరికరాలు కనిపిస్తున్నాయి. ఇంకా హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణ ఇంకా జరగలేదు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుకు సమీపంలో ఉన్న జింజియాంగ్ రీజియన్‌లో ఓ ఆర్టిలరీ యూనిట్‌ను పీఎల్ఏ మోహరించింది. దీనిలో లాంగ్ రేంజ్ పీహెచ్ఎల్-03 రాకెట్ లాంఛర్స్ ఉన్నాయి.
మన తూర్పు కమాండ్‌కు సమీపంలో పెద్ద ఎత్తున డ్రాగన్ సైన్యాన్ని మోహరించడం ఆందోళన కలిగించే అంశమే. అయితే సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. మాకు వస్తున్న నిఘా సమాచారంతో ఆయుధాలను మోహరిస్తూనే ఉన్నాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా భారత్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని నరవణె వెల్లడించారు.
భారత సైన్యం కూడా అందుకు తగ్గట్లుగానే వ్యూహాలతో దూసుకుపోతోంది. తాజాగా లద్దాఖ్‌లోని ఫార్వర్డ్ ఏరియాల్లో తొలిసారిగా కే9 - వజ్ర శతఘ్నులను మోహరించింది. స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9 - వజ్ర శతఘ్నులు.. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై విరుచుకుపడి ధ్వంసం చేయగలవు. ఈ హోవిట్జర్‌లతో కూడిన మొత్తం రెజిమెంట్‌ను వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్ సెక్టార్‌లో మోహరించారు.
ఈ శతఘ్నులు అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పనిచేయగలవని సన్నాహాక పరీక్షల్లో రుజువైంది. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. లద్దాఖ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె తెలిపారు. కే9 వజ్ర హోవిట్జర్‌ను 2018లో సైన్యంలో ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ వీటిని గుజరాత్‌లో తయారు చేసింది. ఈ శతఘ్ని 50 టన్నులు బరువు ఉంటుంది. 47 కేజీల బాంబులను పేల్చగలదు.
ఈ గన్స్ అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కూడా పని చేస్తాయని, క్షేత్ర స్థాయిలో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఓ వార్తా సంస్థకు తెలిపారు. మొత్తం ఓ రెజిమెంట్‌ను మోహరించామని, దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కే-9 వజ్రను కే-9 థండర్ అని కూడా అంటారు. ఇది 155 ఎంఎం సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్. దీని పొడవు 12 ఎం, వెడల్పు 3.4 ఎం, ఎత్తు 2.73 ఎం.
దీనిని ఆపరేట్ చేయడానికి ఐదుగురు అవసరమవుతారు. కమాండర్, డ్రైవర్, గన్నర్, ఇద్దరు లోడర్లు దీనిని ఆపరేట్ చేస్తారు. దీనిని సౌత్ కొరియన్ ఫర్మ్స్ ఏజెన్సీ ఫర్ డిఫెన్స్ డెవలప్‌మెంట్, శాంసంగ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ డిజైన్ చేశాయి. బరస్ట్ మోడ్‌లో 15 సెకన్లలో మూడు రౌండ్లు కాల్పులు జరపగలదని, సుస్టెయిన్ ఫైర్ మోడ్‌లో నిమిషానికి ఆరు రౌండ్లు కాల్పులు జరపగలదని ఈ కంపెనీలు చెప్తున్నాయి. భారత దేశానికి తగినట్లుగా దీనిలో కొన్ని మార్పులు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆక్సిలరీ పవర్ ప్యాక్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, న్యూక్లియర్, బయలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ వంటివాటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)