Arunachal Pradesh: తప్పిపోయిన మీరామ్ టారోన్‌ని వెంటనే మాకు అప్పగించండి, చైనా ఆర్మీని కోరిన ఇండియన్ ఆర్మీ, బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, ప్రధాని మౌనం వీడాలని రాహుల్ గాంధీ చురక
అయితే ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ స్పందించింది.
New Delhi, Jan 20: అరుణాచల ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ అనే బాలుడిని చైనా పీపుల్స్ ఆర్మీ ఎత్తుకువెళ్లిందని ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని (Indian Army seeks assistance from China’s PLA) భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ ( Miram Taron) అనే బాలుడుని చైనా ఆర్మీ భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అపహరించారని ఎంపీ (MP Tapir Gao) తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పీఎల్‌ఏకు (China’s People’s Liberation Army (PLA) తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ.. చైనా సైన్యాన్ని కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయిడంతో అదృశ్యం అయినట్లు తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు. త్సాంగ్పో నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ అని, అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రిపబ్లిక్ డేకు కొన్ని రోజల ముందే భారతదేశానికి చెందిన ఓ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్‌కు తెలియజేశామని, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరామని ఎంపీ తెలిపారు.కాగా సెప్టెంబర్ 2020లో, PLA అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి జిల్లా నుండి ఐదుగురు యువకులను అపహరించి, ఒక వారం తర్వాత వారిని విడుదల చేసింది. ఏప్రిల్ 2020 నుండి తూర్పు లడఖ్‌లో భారత సైన్యం PLAతో ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సమయంలోఈ సంఘటన జరిగింది.
ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారతదేశం, చైనా మధ్య 14 రౌండ్ల సైనిక స్థాయి చర్చలు జరిగాయి. అయితే, తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, దేప్సాంగ్ బల్జ్ మరియు డెమ్‌చోక్ ప్రాంతాలలో విచ్ఛేద ప్రక్రియ ఇంకా జరగలేదు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ప్రస్తుతం ప్రతి వైపు 50,000 నుండి 60,000 మంది సైనికులు ఉన్నారు. లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనాతో భారతదేశం 3,400 కి.మీ పొడవు LACని పంచుకుంటుంది.