Indian Markets Crash: భారీ పతనంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 2900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 8వేల దిగువకు పడిపోయిన నిఫ్టీ, 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత
ఇలా ట్రేడింగ్ ను నిలిపివేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. చాలా సెక్టార్లలో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Mumbai, March 23: భారత్‌లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి (COVID-19 Outbreak) చెందడం, చాలా రాష్ట్రాలు 'లాక్ డౌన్' (Lockdown) విధించడం తదితర అంశాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Markets) భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 10 శాతం పతనమై 2,991.85 పాయింట్లు నష్టంతో, 26,924 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 9.63 శాతం క్షీణించి 842 పాయింట్ల నష్టంతో 7,903 వద్ద ట్రేడ్ అవుతోంది. పతన శాతం ఎక్కువవుతుండటంతో ట్రేడింగ్ 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇలా ట్రేడింగ్ ను నిలిపివేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. లాక్‌డౌన్ దిశగా ఇండియా, ఇప్పటికే లాక్‌డౌన్‌లో 8 రాష్ట్రాలు
చాలా సెక్టార్లలో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండూ ఒక్కొక్కటి 10 శాతానికి పైగా పడిపోగా, మారుతి సుజుకి ఇండియా 9.7 శాతం క్షీణించింది.
విస్తృతమైన మార్కెట్లో, బిఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 6.9 శాతం కోత పడగా, బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.4 శాతం క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా భారత మార్కెట్లపై కనిపించింది. కరోనావైరస్ భయాందోళనల నడుమ జపాన్ మినహా మిగతా దేశాల మార్కెట్లన్నీ నష్టాలతోనే కొనసాగుతున్నాయి. సోమవారం ఆస్ట్రేలియా స్టాక్స్ 8 శాతం పడిపోయాయి. హాంగ్ సెంగ్ ఇండెక్స్ 5.02 శాతం పతనమైంది.
ప్రాణాంతక కోవిడ్-19ను అరికట్టడానికి ప్రపంచంలోని అని దేశాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేసులలో అపారమైన పెరుగుదల, మరణాల రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.