New Delhi, Mar 23: ఇండియాలో కరోనావైరస్ (Coronavirus in India) విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దీని భారీన పడి 7మంది చనిపోయారు. ఇక కోవిడ్ 19 (CODI-19) పాజిటివ్ కేసులు సంఖ్య 400కు అటూ ఇటూగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం (Central Govt)అలర్ట్ అయింది.
దేశంలోని రాష్ట్రాలకు పలు సూచలను జారీ చేస్తోంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని (Coronavirus Scare) అరికట్టడంలో భాగంగా నిన్న దేశ వ్యాప్తంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో (Janata Curfew) భాగస్వాములై, విజయవంతం చేశారు.
అయితే ఇది ఒక్కరోజుకు పరిమితం కాకుండా ఈ నెలాఖరు వరకు పాటించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే 8 రాష్ట్రాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. ఈ నెలాఖరు వరకు 8 రాష్ట్రాలు స్వీయనిర్బంధంలో ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఈ నెల 31 అర్థరాత్రి వరకు లాక్‌డౌన్ విధించుకున్నాయి.
మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్
ఢిల్లీ లాక్‌డౌన్
ఢిల్లీ నేటి ఉదయం 6 గంటల నుంచి 31 మార్చి, రాత్రి 12 గంటల వరకు రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో రాజధాని రాష్ట్రంలో ఈ నిబంధన అమలులో ఉంటుందని ఆయన అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. విమానాలను కూడా మార్చి 31 వరకు రద్దు చేస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజారవాణా వ్యవస్థలన్ని కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రైవేట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. 25 శాతం డీటీసీ బస్సులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
పంజాబ్ లాక్‌డౌన్
రాజస్థాన్ ప్రభుత్వం బాటలో పంజాబ్ సర్కార్ కూడా వచ్చింది. తమ రాష్ట్రంలో ఈనెల 31వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పంజాబ్ సర్కార్ కూడా లాక్ డౌన్ చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. దీని ప్రకారం నిత్యావసరాలు, కూరగాయలు,మెడికల్ షాపుల మినహా మిగిలిన దుకాణాలు, సంస్థలను ఈ నెల 31 వరకూ మూసివేయనున్నారు. అలాగే పట్టణంలో బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు తిరిగేందుకు అనుమతించరు. అత్యవసర సేవలు మినహా మహారాష్ట్రలో అన్నీ బంద్ చేశారు.
80 జిల్లాల్లో లాక్‌డౌన్
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. హర్యానాలో 7 జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లో 5 జిల్లాలు, పశ్చిమబెంగాల్‌లోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ఒడిషాలోని 5 జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉండనున్నాయి. అసోంలో మరో 3 రోజుల పాటు జనతాకర్ఫ్యూ పొడగించారు.
కాగా లాక్‌డౌన్ అయిన రాష్ట్రాలు, ఆయా జిల్లాల్లో అత్యవసర సేవలు యదావిధిగా కొనసాగుతాయి. అంతర్జాతీయ విమానాలు, ప్రజారవాణా పూర్తిగా నిషేధించారు. ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు బంద్ కానున్నాయి. అత్యవసర పరిస్థితి కోసం కొన్నింటిని అందుబాటులో ఉంచనున్నారు. భారత్‌లో ఇప్పటివరకు కోవిద్-19 కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించగా, బాధితుల సంఖ్య 360కి చేరకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,130 మందికి వ్యాధి సోకగా ఆదివారం ఒక్కరోజే 1,702 మృతి చెందడంతో మొత్తం మరణాలు 13,444కు చేరుకున్నాయి. వీరిలో ఒక్క ఇటలీ దేశస్తులే 651 మంది కరోనా కాటుకు గురయ్యారు. సుమారు 170 దేశాలకు వైరస్ వ్యాపించగా దీని విస్తృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో మిలియన్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 35 దేశాలు సరిహద్దులను మూసి వేసుకున్నాయి. అయితే, మరణాలు, బాధితుల సంఖ్య వెల్లడించిన వాటికంటే ఎక్కువగానే ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.