Migrant Workers in Iraq: స్వదేశానికి వెళ్లాలంటే లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందే, వలస కార్మికులకు షాకిచ్చిన ఇరాక్ ప్రభుత్వం
కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే 1500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Hyd, April 19: పొట్ట కూటి కోసం ఇరాక్ వెళ్లిన వలస కార్మికులకు ఇరాక్ ప్రభుత్వం షాకిచ్చింది. కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే 1500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే లక్ష జరిమానాపై వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అకామ లేకపోవడంతో ఎవరూ పనిఇవ్వడం లేదని, పార్కులలో తలదాచుకుంటూ అష్టకష్టాలు పడుతున్నామని ఇలాంటి పరిస్థితుల్లో లక్ష రూపాయలు ఎలా చెల్లించాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు సుమారు 20 మంది వరకు ఉండిపోయారు. గతంలో అకామ లేనివారిని ఇరాక్‌లో మన రాయబార కార్యాలయం అధికారులు జరిమానాను తప్పించి ఇంటికి పంపించారు. అయితే కొంతమంది ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయారు.
తాజాగా ఇరాక్‌లో చట్టవిరుద్ధంగా ఉన్నవారిపై అక్కడి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. రూ. వెయ్యి నుంచి 1,500 వరకు అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. లక్షకు పైగా) జరిమానా చెల్లిస్తేనే విదేశీ కార్మికులను వారి దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని వలస కార్మికులు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ను ఆశ్రయించగా సదరు సంస్థ ప్రతినిధులు విదేశాంగ శాఖను సంప్రదించారు. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు.మరి విదేశాంగ శాఖ ఏం చేస్తుందో చూడాలి.