Mumbai, April 19: గత ఏడాది న్యూయార్క్‌లో దాదాపు 3,40,000 మంది మిలియనీర్లు నివసించారు, ఇది మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారిందని ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది. ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో 10 నగరాలతో, సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితాలో అత్యంత సంపన్న నగరాలు కలిగిన దేశంగా చైనా, ఆస్ట్రేలియాలను యునైటెడ్ స్టేట్స్ అధిగమించింది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ ఉండగా, ఈ భూమ్మీద ఎక్కువ మంది సంపన్నులు ఈ నగరంలోనే నివసిస్తున్నారని వెల్త్ ట్రాకర్ కంపెనీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ వెల్లడించింది. ఈ మేరకు 2023 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. సంపన్న నగరంగా నిలిచిన అమెరికాలోని న్యూయార్క్ లో ఏకంగా 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది.
వంద మిలియన్ డాలర్లకు పైబడి (సెంటి మిలియనీర్స్) ఆస్తులు ఉన్న వారి సంఖ్య 724 కాగా 58 మంది బిలియనీర్లు కూడా ఈ నగరంలో ఉంటున్నారని వెల్లడించింది. అమెరికాలోని నాలుగు సిటీలు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలిస్, షికాగోలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 97 నగరాలకు చోటు దక్కింది. న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఇక్కడ 2.90 లక్షల మంది మిలియనీర్లు నివసిస్తున్నారని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తన రిపోర్టులో పేర్కొంది.
మూడో స్థానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో దక్కించుకుంది. ఈ సిటీలో 2.85 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరొందిన లండన్.. ప్రస్తుత జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. లండన్ తర్వాతి స్థానంలో సింగపూర్ నిలిచింది. చైనా రాజధాని బీజింగ్, షాంఘైలకూ ఈ జాబితాలో చోటు దక్కింది.కాలిఫోర్నియాలోని బే ఏరియాలోని సిలికాన్ వ్యాలీ మరియు శాన్ ఫ్రాన్సిస్కో పరిసర ప్రాంతాల్లో 63 మంది బిలియనీర్లు నివసిస్తున్నారని, న్యూయార్క్ కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారని జాబితా వెల్లడించింది. అలాగే బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో లాస్ ఏంజెల్స్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై, సిడ్నీలు ఉన్నాయి.
ఏ భారతీయ నగరం కూడా 'టాప్ 10'లో చేరలేకపోయినప్పటికీ, ముంబై మళ్లీ భారతదేశంలో అత్యంత సంపన్న నగరంగా ఆవిర్భవించింది, జాబితాలో 21 వ స్థానంలో నిలిచింది.