Johnson & Johnson Vaccine: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అనుమతి, ప్రస్తుతం దేశంలో అందుబాటులో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి, మోడెర్నా టీకాలు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ట్విటర్ వేదికగా ఈ వివరాలను తెలిపారు.
New Delhi, August 7: అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ (Johnson & Johnson Vaccine) అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ట్విటర్ వేదికగా ఈ వివరాలను తెలిపారు. మన్‌సుఖ్ మాండవీయ ఇచ్చిన ట్వీట్‌లో, భారతదేశం తన వ్యాక్సిన్ సంఖ్యను పెంచుకుందని తెలిపారు. భారత దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి (Gets Emergency Use Authorisation) ఇచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడు దేశంలో 5 ఈయూఏ (ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్) వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశ ఉమ్మడి పోరాటాన్నిఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. బయలాజికల్ ఈ లిమిటెడ్ ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను మన దేశానికి తీసుకొస్తారు. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.
Here's Health Minister Tweet
భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఆగస్టు 5న దరఖాస్తు చేసుకున్నట్లు నిన్న జాన్సన్ ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వంతో జరుపుతోన్న చర్చలు త్వరలోనే కొలిక్కి రావాలని కోరుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆమోదం లభించింది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులో ఉండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం స్పుత్నిక్ ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ జాబితాలోకి ఇప్పుడు జాన్సన్ టీకా చేరింది. అయితే మిగతావన్నీ రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు టీకా కావడం గమనార్హం.