Minister of Health and Family Welfare Mansukh Mandaviya (Photo-Twitter)

New Delhi, July 7: దేశంలో శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 38,628 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ఇందులో 4,12,153 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,10,55,861 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 4,27,371 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 40,017 మంది బాధితులు కోలుకోగా, 617 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

కరోనా పాజిటివిటీ రేటు 2.21 శాతంగా తెలిపింది. గత 12 రోజులుగా ఇది 3 శాతం లోపే ఉంటుందని పేర్కొన్నది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. దేశంలో మొత్తం 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. ఇందులో గత 24 గంటల్లో 49,55,138 మందికి టీకా (Coronavirus Vaccine) పంపిణీ చేశామని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌ లోభారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం సాయంత్రం వరకు వ్యాక్సిన్‌ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.

దేశంలో కోవిడ్‌ కట్టడికి ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను పంపిణీ చేస్తుండగా.. త్వరలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసిన కోర్బివాక్స్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా (Mansukh L Mandaviya) శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్లతో భేటీ అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోర్బివాక్స్‌ పురోగతి గురించి మహిమా దాట్ల ఆరోగ్య మంత్రికి వివరించారు.

Here's Mansukh Mandaviya Tweet

కోర్బివాక్స్‌ టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్రమంత్రి.. బయోలాజికల్‌-ఈ ఎండీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు మన్సుక్‌ మాండవియా శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇప్పటికే బయోలాజికల్‌-ఈ కంపెనీకి కేంద్రం 1500 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ సందర్భంగా బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ‘‘మా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈనెల నుంచే కోర్బివ్యాక్స్‌ ఉత్పత్తి ప్రారంభిస్తాం. డిసెంబర్‌లోగా కేంద్రానికి 30 కోట్ల వ్యాక్సిన్లు అందజేస్తాం’’ అని తెలిపారు.