Anantapur School Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, జోగ్ జలపాతం వద్ద లోయలో పడిన అనంతపురం జిల్లా స్కూల్ బస్సు, విద్యార్థి మృతి, 46 మందికి గాయాలు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్, తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశాలు
వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్ జలపాతం(Jog Falls) వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.
Kadiri, January 04: అనంతపురం జిల్లా కదిరి (Kadiri) నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి (Kadiri School Bus Accident) గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్ జలపాతం(Jog Falls) వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, 46 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.
శివమొగ్గ జోగ్‌ఫాల్స్ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కదిరి హైస్కూల్‌కు (Kadiri Government Boys High School)చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. దార్వాడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులు బయటకు వచ్చారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబామక్సుద్దీన్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకు ఇక లేడని తెలుసుకుని మక్సుద్దీన్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
బస్సు ప్రమాద తీవ్రతతో పాఠశాల హెడ్మాస్టర్ గుండెపోటు రావడంతో ఆయనను కూడా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పరిస్థితిపై ఆందోళనకు గురవుతున్నారు. కర్ణాటక
ఈ నెల 2వ తేదీన కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులతో కలిసి 45మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం రోజంతా జోగ్ జలపాతం వద్ద ఆనందంగా గడిపారు. తర్వాత రాత్రిపూట బస చేసేందుకు మురిడి బయలుదేరగా మార్గంమధ్యలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఆ దారిగుండా వెళుతున్న ఇతర వాహనాల డ్రైవర్లు సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో వారు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యాయేసుబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రైవేటు బస్సు లోయలో పడే క్రమంలో ఒక చెట్టు దేవుడిలా అడ్డువచ్చిందని.. లేకపోతే ప్రమాద తీవ్రత అధికంగా ఉండి అనేకమంది మృత్యవాత పడేవారని స్థానికులు చెబుతున్నారు.డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం రాజేంద్రన్ తెలిపారు.
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం జగన్, తక్షణమే సహాయక కార్యక్రమాలు అందించాలని ఆదేశాలు
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక కార్యక్రమాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో మరో విషాదం
శ్రీకాకుళం జిల్లా మహేంద్రతనయ నదిలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్ళడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటన మందస మండలం కొత్తపల్లి వద్ద జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒడిశా వాసులుగా గుర్తించారు. మృతుల్లో చంటిపాపతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సింహాచలం నుంచి బరంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.