Kerala Rains: భారీ వర్షాలకు కేరళ విలవిల, 11 మంది మృతి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేసిన సీఎం పినరయి విజయన్, కేరళకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపిన హోం మంత్రి అమిత్ షా
గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి.
Thiruvananthapuram, October 17: కేరళలో వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీచేసింది. ప్రధానంగా కొట్టాయం, పథనంమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీనష్టం వాటిల్లింది. వీటితోపాటు ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం సాయంత్రం ఇడుక్కి జిల్లాలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది.
వర్షాల కారణంగా కొట్టాయం జిల్లా కూట్టికల్ ప్రాంతంలో కొండచరియలు (Landslide-Hit Koottikkal) విరిగిపడ్డాయి. పలువురు ఆ కొండచరియల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే తొమ్మది మృతదేహాలను వెలికితీసిన రక్షణ సిబ్బందికి తాజాగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 11కు (Death Toll Reaches 11) చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ సిబ్బంది, భారత వాయుసేన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నాయి.
Here' s Kerala Rain Visuals
ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తంగా ఉండాలని మరోసారి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వర్షాల కారణంగా ఆశ్రయం కోల్పోయిన వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విజయన్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని పునరావాస కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఎడతెరపి లేని వర్షాలవల్ల పతనమ్‌థిట్ట, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల్లోని మడమోన్, కల్లుప్పర, తుంపమాన్, పుల్లకయార్, మనిక్కల్, వెల్లయ్‌కడవ, అరువిపురం డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయని వెల్లడించారు.
భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు సాధ్యమైన అన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలు సృష్టించిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించామన్నారు.
అమిత్ షా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. అవసరంలో ఉన్న ప్రజలకు సాధ్యమైన అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సాయపడుతుందని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో సాయపడేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు స్పందన దళం) సిబ్బందిని ఇప్పటికే పంపించామని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Kerala Rains Video
శబరిమల ఆలయం ఆదివారం ఉదయం తెరచుకున్నది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు స్వామి దర్శనానికి రాకుండా ఉండటమే మంచిదని ఆలయ బోర్డు సూచించింది. తూల మాసం పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు.
ఇక తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో పలుచోట్ల వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో తిరపరప్పు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.
వరద నీటిలో మునిగిపోతున్న పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఒక బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉండడంతో దాని నుంచి బయటపడడానికి ప్రయాణికులు చేసే హాహాకారాలకు సంబంధించిన వీడియో గుండె దడ పెంచుతోంది. ఈ ఒక్క వీడియో కేరళలో భయంకర పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొట్టాయంలో వర్షపు నీటిలో ఒక కారుకి తాళ్లుకట్టి లాగి తీసుకువెళుతున్న వీడియోని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.