Himachal Pradesh Landslide: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో లభ్యమైన ఆర్టీసీ బస్సు శిథిలాలు, ఇంకా తెలియరాని 20 మంది ప్రయాణికుల ఆచూకీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

వారి కోసం రెస్క్యూ అపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్లురప్పలతో కూడిన దిబ్బల కింద 200 మీటర్ల విస్తీర్ణంలో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు అంచనావేస్తున్నారు...

Kinnaur Landslide (Photo Credits: ANI)

Shimla, August 12: హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన బస్సుకు సంబంధించిన శిథిలాలు గురువారం లభ్యమమైనట్లు సహయక బృందాలు తెలిపాయి. అయితే ఇప్పటికీ ఈ ప్రమాదానికి సంబంధించి 20 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ అపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్లురప్పలతో కూడిన దిబ్బల కింద 200 మీటర్ల విస్తీర్ణంలో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు అంచనావేస్తున్నారు. వీరిని రక్షించడానికి పలు రెస్క్యూ ఆపరేషన్ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో గల నిగుల్సారి గ్రామ సమీపంలో సిమ్లా-రెక్‌కాంగ్ పియో ఘాట్ రోడ్డు హైవేపై మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో కింద ప్రయాణిస్తున్న ఒక ట్రక్, ఆర్టీసి బస్సు సహా మరికొన్ని వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది ప్రాణాలు కోల్పోయారు, వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు రేకాంగ్ పియో నుండి సిమ్లా మీదుగా హరిద్వార్ వెళ్తోంది. దాని డ్రైవర్ మరియు కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. మరో 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు, అయితే మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ సుదేశ్ కుమార్ వెల్లడించారు.

ఈ ఘటనపై ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. "కిన్నౌర్ వ‌ద్ద కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న విషాద‌క‌రం. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి నేను ఆలోచిస్తున్నాను. అలాగే ఈ దుర్ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను. స‌హాయ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని ర‌క్షించేందుకు సాధ్య‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకోవ‌డం జ‌రుగుతుంది." అని మోదీ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు