Doctor Rape-Murder Case: కలకత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్/లై డిటెక్టర్ టెస్ట్ చేయనున్న సీబీఐ, అనుమతించిన కలకత్తా హైకోర్టు
ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్ (Polygraph Test) పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది
Kolkata, August 19: కోలకతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన (Kolkata Doctor Murder)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్ (Polygraph Test) పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ (CBI) వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అతడికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలు ఆగస్టు 8వ తేదీ రాత్రి విధుల్లో ఉన్న సమయంలో దారుణ హత్యాచారానికి గురైన సంగతి విదితమే. హాస్పిటల్ సెమినార్ హాల్‌లో జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో సివిక్ వాలంటరీ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్కడ మహిళలకు భద్రత కరువైందంటూ ఆరోపణ
ఆ హాస్పిటల్‌లో వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్‌ను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆసుపత్రి వెనుక ఉన్న ప్రదేశానికి అతడు వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ పోర్న్ చూసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.అదే రోజు రాత్రి సంజయ్ రాయ్ చాలాసార్లు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు.
నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతడు ప్రయత్నించినట్లు చెప్పారు. సంఘటనా స్థలంలోని రక్తం మరకలను కడిగేందుకు సంజయ్ రాయ్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుంచి అతడు బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం, పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు, దర్యాప్తు కోసం కోల్‌కతా చేరుకున్న సీబీఐ
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. లేదా నిందితుడి వెనుక ఎవరైనా ఉండి ఉంటారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే నిజానిజాలు తెలుసుకునేందుకు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని న్యాయస్థానానికి సీబీఐ కోరింది. తాజాగా అందుకు అంగీకరించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.
వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు.
ఘటన (Kolkata Doctor Rape Murder) సమయంలో ఆమె నిందితుడితో శక్తిమేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయట. బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.