New Delhi, AUG 14: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై (Kolkata Doctor Rape-Murder Case) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైద్యరంగంలో మహిళల్లో అభద్రతాభావం పెంచుతోందన్నారు. విద్యా, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.
‘భాదితులకు న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం చూస్తుంటే.. ఆసుపత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుల కోసం బయటకి ఎలా పంపుతారనే ఆలోచనను రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి’ అని ప్రశ్నించారు.
कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।
पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024
‘హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్‌కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం.. కోల్‌కతా వైద్యురాలి ఘటన భయానకమైనదిగా పేర్కొ న్న విషయం తెలిసిందే. దీనిని హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు.