Kolkata, August 14: కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై దారుణ అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది.ఈ కేసులో ఇప్పటికే కొత్త సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది. కోల్‌కతా చేరుకున్న తర్వాత ఈ బృందం మొదట న్యూ టౌన్ రాజర్‌హట్‌కు చేరుకుని BSF సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలుసుకున్నారు.
ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు(high court) నిన్న ఆదేశాలు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు (RG Kar Doctor Rape-Murder Case) సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. కేసు డైరీని బుధవారం ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు తెలిపింది. సీబీఐకి బెంగాల్ డాక్టర్ అత్యాచార కేసు, సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్ కతా హైకోర్టు
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్, ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.విధుల బహిష్కరణను విరమించుకోవాలని రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోరింది. కాగా, కేంద్రమంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది.
పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు బాధితురాలిపై క్రూరమైన దాడికి పాల్పడ్డాడని, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టు తేలింది. అదేవిధంగా తనపై లైంగిక దాడిని బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాట చోటుచేసుకొన్నట్టు పోస్టుమార్టం నివేదిక చెబుతున్నది. ముఖంపై రక్తపు గాయాలున్నాయని, కండ్లలో నుంచి రక్తసావ్రం అయిందని, బాధితురాలి జననాంగాల్లో తీవ్రమైన గాయం అయినట్టు తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో బాధితురాలు మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
ఇటీవల వైద్యులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకు ప్రత్యేకంగా పాలసీని రూపొందించాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) సూచించింది. ఈ మేరకు అన్ని మెడికల్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టళ్లు, క్యాంపస్‌లోని ఇతర ప్రదేశాలు, రెసిడెన్షియల్ క్వార్టర్లలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. ఎవరైనా వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనలపై 48 గంటల్లోగా నివేదికను ఎన్‌ఎంసీకి పంపాలని సూచించింది.