Delhi Lockdown: మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగింపు, తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరత, ఢిల్లీలో కొత్తగా వచ్చే పేషెంట్లను చేర్చుకోలేమంటూ ప్రముఖ ఆస్పత్రిలో బోర్డు
మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ ( lockdown in Delhi) అమల్లో ఉంటుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు.
New Delhi, April 25: దేశ రాజధానిలో కరోనా కేసులు పెరగడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Delhi Lockdown) పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ ( lockdown in Delhi) అమల్లో ఉంటుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయని కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే పేషెంట్లను ఆసుపత్రి చేర్చుకోవట్లేదు. కొత్త అడ్మిషన్లకు సంబంధించి ఆసుపత్రి ఆవరణలోనే ఓ పెద్ద నోటీస్ బోర్డునూ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండడంతో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే రోగులను చేర్చుకోవట్లేదని ఫోర్టిస్ ప్రకటించింది.‘‘ఆసుపత్రిలో పరిస్థితి గురించి ముందు నుంచే అధికారులకు చెబుతూ వచ్చాం. అయితే, ఆక్సిజన్ అందిస్తామంటూ హామీ ఇచ్చారు.
అయితే, మా కోటా కోసం నిన్నటి నుంచి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇవ్వాళ మధ్యాహ్నానికి హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోతుంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారికి అడ్మిషన్లు ఇవ్వట్లేదు. పరిస్థితి మామూలయ్యేదాకా అత్యవసర సేవలనూ ఒప్పుకోలేని పరిస్థితి.
Here's Tweet
ఇప్పటికే ఉన్న ఇన్ పేషెంట్లకు మావల్ల అయిందంతా చేస్తున్నాం’’ అని నోటీస్ లో పేర్కొంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఆక్సిజన్ స్టాక్ వచ్చిందని, అది ఆదివారం మధ్యాహ్నానికే అయిపోతుందని ఆసుపత్రి ప్రతినిధి చెబుతున్నారు. ప్రస్తుతం వంద మంది పేషెంట్లు ఆక్సిజన్ పై ఉన్నారని చెప్పారు.