New Delhi, April 25: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో (Mann Ki Baat)ఈ విషయంపై చర్చించారు.దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ అదుపునకు తీసుకుంటున్న చర్యల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. కరోనా మరింతగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను అందరూ గుర్తించారని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ విషయంలో వస్తున్న వదంతులను పట్టించుకోకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ మన సహనాన్ని, నొప్పిని భరించే శక్తిని పరీక్షిస్తున్న సమయంలో (COVID-19 Second Wave Testing Our Patience) తాను మీతో మాట్లాడుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మన ప్రియ బాంధవులెందరో మనల్ని విడిచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మొదటి వేవ్‌ను విజయవంతంగా అణిచివేసిన తర్వాత జాతి స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగాయని, కానీ తుఫానుల విజృంభించిన సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
బారత ప్రభుత్వం తరపున అన్ని రాష్ట్రాలలోనూ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటి వరకూ 45 ఏళ్ల వయసు పైబడినవారికి టీకాలు అందజేశామని, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకాలు వేస్తామన్నారు. కరోనా విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచించారు. దేశంలో కరోనా బారిన పడినవారిలో అత్యధికులు వ్యాధి నుంచి కోలుకుంటున్నారని, కరోనా వైరస్ మన ధైర్యానికి పరీక్ష పెడుతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కరోనా విషయంలో భయపడనవసరం లేదని అయితే అప్రమత్తంగా మెలగడం అత్యవసరమని అన్నారు. రాయపూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో నర్సింగ్ సేవలు అందిస్తున్న సిస్టర్ భావనా ధృవ్ గురించి ప్రధాని ప్రస్తావించారు. భావనా లాంటి నర్సింగ్ స్టాఫ్ వారి కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తూ, అందరికీ స్ఫూర్తినిస్తున్నారన్నారు. అయితే వారంతా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ మహమ్మారిని అరికట్టడం కోసం తాను ఫార్మా పరిశ్రమ, ఆక్సిజన్ ఉత్పత్తి రంగాలకు చెందిన పలువురు నిపుణులు సమావేశమై చర్చించానని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మన హెల్త్‌కేర్ సిబ్బంది, డాక్టర్లు కరోనా మహమ్మారి ప్రధాన యుద్ధం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంలో కరోనా మహమ్మారి వారికి పలు విధాల అనుభవాలను మిగిల్చిందని చెప్పారు.
కరోనా మహమ్మారికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు అస్సలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. నమ్మకమైన ప్రసార మాధ్యమాల నుంచి మాత్రమే ప్రజలు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. చాలా మంది వైద్యులు కూడా సోషల్ మీడియాలో కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారని, కోరినవారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రాలు చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.