Mumbai, April 24: మహారాష్ట్రలో మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగి ఏడు మంది మృతి (7 die in Yavatmal after consuming hand sanitiser) చెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ తహసీల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్-19 నిబంధనలతో మద్యం అమ్మకాలను (they couldn't get alcohol) నిలిపివేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారంతో శానిటైజర్ తాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డారు.
మృతుల్లో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు వని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ వైభవ్ జాదవ్ తెలిపారు. మిగతా నలుగురి మృతదేహాలకు బంధువులు అధికారులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు 35 ఏళ్లలోపు వారుండగా.. ఇద్దరు 47 ఏళ్లలోపు వ్యక్తులు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మరణాలపై కేసు నమోదు చేశామని, మిగిలిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు వైభవ్ జాదవ్ పేర్కొన్నారు.
30 మిల్లీ లీటర్ల శానిటైజర్ 250 మిల్లీలీటర్ల మద్యం ఇచ్చే కిక్కు ఇస్తుందని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని న్యాయవాది దిలీప్ పార్చేక్ ఆరోపించారు. దీంతో వీరంతా ఐదు లీటర్ల శానిటైజర్ కొనుగోలు చేసుకొని శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారని, ఆ తర్వాత వాంతులు చేసుకున్నారు. వారందరినీ వనిలోని ప్రభుత్వ గ్రామీణ హాస్పిటల్‌లో చేర్పించగా.. పరిస్థితి విషమించి ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ వల్ల వైన్ షాప్‌లను మూసివేశారు. అయితే మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది తొలి విడత లాక్‌డౌన్ వల్ల ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి