New Delhi, April 24: కరోనా దేశంలో విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సుంకాలను (India waives customs duty on Coronavirus vaccines) పూర్తిగా మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, మూడు నెలలపాటు అమల్లో ( oxygen-related equipment import for 3 months) ఉంటుందని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు శనివారం వెల్లడించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ప్రధాన మంత్రి వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాల వల్ల కోవిడ్ చికిత్సకు అవసరమైన పరికరాలు చౌక ధరలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్‌ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్‌లు కొనుగోలుకు అవకాశం కల్పించింది.
Here's PM Tweet
At the high-level meeting, key decisions of waiving customs duty on oxygen and oxygen related equipment & COVID-19 vaccines were taken. https://t.co/TgorIafqw6
— Narendra Modi (@narendramodi) April 24, 2021
ఇటీవలే రెమ్‌డిసివిర్, దాని యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రీడియెంట్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మినహాయించినట్లు ఈ ప్రకటన పేర్కొంది. రోగులకు ఆక్సిజన్ అందజేయడానికి సంబంధించిన పరికరాల దిగుమతిని వేగవంతం చేయాలనే సలహా వచ్చిందని పేర్కొంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఇంటివద్ద, ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన పరికరాల దిగుమతులను తక్షణమే పెంచాలని మోదీ చెప్పారని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందే వాటిలో... మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్స్, ట్యూబింగ్ వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్సార్‌ప్షన్, ప్రెజర్ స్వింగ్ అబ్‌సార్‌ప్షన్, ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్స్, ఆక్సిజన్ కనిస్టర్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్స్, ఆక్సిజన్ సిలిండర్స్, క్రయోజనిక్ సిలిండర్స్ వంటివి ఉన్నాయి.
ఆక్సిజన్, మెడికల్ సప్లయ్స్‌ను మెరుగుపరిచేందుకు గత కొద్ది రోజులుగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. భారత వాయు సేన విమానాల్లో సింగపూర్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రయాణ కాలాన్ని తగ్గించడం కోసం ఆక్సిజన్ ట్యాంకులను భారత వాయు సేన రవాణా చేస్తోందని తెలిపింది. మరోవైపు మే, జూన్ నెలల్లో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేయనున్నట్లు తెలిపింది.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటన చేసింది.
ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.