Maharashtra Bhushan Awards Tragedy: ఎండ దెబ్బకు 11 మంది మృతి, ఆస్పత్రిలో మరో 50 మంది, తీవ్ర విషాదంగా మారిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవ సభ
మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు.
Mumbai, April 17: మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ మేరకు సీఎం ఏక్‌నాథ్ శిందే ఆదివారం రాత్రి వెల్లడించారు. వడదెబ్బ తగిలిన మొత్తం 50 మందిని నవీ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సకు తరలించగా వారిలో 11 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారన్నారు.
ఆదివారం నవీ ముంబైలో అమిత్ షా ముఖ్య అతిథిగా మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవం జరిగింది. బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ వర్గం) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహించారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్‌కు మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డును (Maharashtra Bhushan award) ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన సామాజిక కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోగా.. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ, ఎండ నుంచి రక్షణ కల్పించేలా షెడ్లుగానీ, టెంట్లుగానీ వేయలేదు. ఈ క్రమంలో మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక, వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రమే టెంట్లు, షెడ్లు వేశారు.
38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బతో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మరో 50 మందికి పైగా వడదెబ్బకు గురయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రకటించారు. ఎండవేడిమి తట్టుకోలేక మరణించారని తెలిపారు.
ఈ ఘటన విషయం తెలియడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నవీ ముంబైకి చేరుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వచ్చే జనం కోసం కనీస వసతులు కల్పించకపోవడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. బీజేపీ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.