Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త
ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో.....
New Delhi, February 7: చైనా కేంద్రంగా విజృంభిస్తున్న కరోనావైరస్ (Coronavirus) కారణంగా దీని బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ను నియంత్రించేందుకు చైనా తీవ్రంగా శ్రమిస్తుంది, ఈ మహమ్మారిని వదిలించే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వేళ, ఓ భారతీయుడు దీనికి వాక్సిన్ (Coronavirus Vaccine) ను అభివృద్ధి చేయడంలో సాఫల్యత సాధించాడు. భారతీయ ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ (Pro. SS Vasan) నేతృత్వంలో ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) కు చెందిన పాథోజెన్స్ టీమ్ కరోనావైరస్ (2019-nCoV) కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో పెద్ద పురోగతి సాధించింది.
ఆస్ట్రేలియాలోని డోహెర్టీ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గత వారం కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్ ను వేరుచేయగలిగారు, ప్రొఫెసర్ వాసన్ బృందం కరోనా వైరస్ పై అధ్యయనాలు చేయడాని ముందుగా అవసరమైన పరిమాణంలో ఈ వైరస్ ను పెంచింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో ప్రపంచంలో ఉన్న పాథోలజిస్టులకు కరోనావైరస్ కు వాక్సిన్ తయారు చేసే దిశగా ఒక మార్గం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కరోనావైరస్ ను నిరోధించే వాక్సిన్ తయారయ్యే అవకాశం ఉంది. వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రొఫెసర్ వాసన్ అనేక ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారు.
తన పరిశోధనలపై ప్రొఫెసర్ వాసన్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలో నా సహచరులు వైరస్ డయాగ్నస్టిక్స్, నిఘా మరియు ప్రతిస్పందనపై కూడా పనిచేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం మరొక భాగం టీకా యొక్క యాంటిజెన్ల అభివృద్ధిపై క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం సమన్వయంతో పనిచేస్తుంది. కరోనావైరస్ సోకకుండా ముందస్తు చర్యలు, ఆ తర్వాత చికిత్స మూల్యాంకనం చేయడం ద్వారా దశలవారీగా ఈ వైరస్ కు టీకాను అభివృద్ధి పరచడానికి సాధ్యపడుతుంది" అని పేర్కొన్నారు. కరోనావైరస్ లక్షణాలతో 60 మందికి పైగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిక
ప్రొఫెసర్ వాసన్ బిట్స్ పిలాని మరియు ఐఐఎస్సి-బెంగళూరులో ఉన్నత విద్యలను అభ్యసించి, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ ద్వారా డాక్టరేట్ పూర్తి చేశారు. గతంలో ఈయన డెంగీ, చికున్‌గున్యా మరియు జికా లపై పరిశోధనలు చేశారు.
చైనాలో కరోనావైరస్ బారినపడి ఇప్పటివరకు 600 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.