India-Maldives Relations: భారత్ మాకు చాలా అవసరం, యూటర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు, ఏమన్నారంటే..

ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు.

Maldives President Mohamed Muizzu Thanks PM Narendra Modi-Led Government for INR 30 Billion Support, USD 400 Million Bilateral Currency Swap Agreement

New Delhi, Oct 7: మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఉభయ దేశాల నేతలు సమావేశమయ్యారు. భారత్‌తో మాల్దీవుల ద్వైపాక్షిక విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఈసందర్భంగా మాల్దీవులతో భారత్‌కున్న చిరకాల స్నేహం గురించి మోదీ గుర్తు చేశారు. ద్వీప దేశానికి కష్టమొస్తే.. ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్‌ అని పేర్కొన్నారు. దానిని నిర్ధరించేలా కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేయడం గురించి ప్రస్తావించారు. మాల్దీవుల్లో రూపే కార్డుతో పేమెంట్‌ సేవలు ప్రారంభించి, తొలి లావాదేవీని మోదీ, ముయిజ్జు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు.

మావోయిస్టులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు,దేశంలో వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు వెల్లడి

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొయిజ్జు.. తనని భారత్‌కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

‘మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతిసారి భారత్ వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ది ఎంతో కీలక పాత్ర’ అని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతో పాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని.. భవిష్యత్తులో మరింత మంది సందర్శిస్తారని కోరుకుంటున్నానని మొయిజ్జు అన్నారు.తమ దేశంలో పెట్టబడులు పెంచేందుకు భారత్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

పలు ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా మాలే, మాలే ప్రజలకు న్యూఢిల్లీ ఎప్పుడూ చేయూతనిస్తుండటం పట్ల ముయుజ్జు కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల అవసరాలకు అనుగుణంగా 400 మిలియన్ డాలర్లు, రూ.300 కోట్ల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్టు చెప్పారు. తమ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా భారత్ స్నేహహస్తం అందిస్తూనే ఉందన్నారు. అందుకు తాము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అన్నారు. అయితే గతంలో మొయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్ల నాటిదన్నారు. ముందుగా ముయిజ్జు, మాల్దీవుల ప్రతినిధి బృందానికి నా ఆహ్వానం. మన బంధం శతాబ్దాల నాటిది. భారత్‌.. మాల్దీవులకు అతి దగ్గరి పొరుగు దేశం, సన్నిహిత మిత్ర దేశం. మా నైబర్‌హుడ్ పాలసీ, సాగర్ విజన్‌లో మాల్దీవులది కీలక స్థానం. ఈ దేశం కోసం స్పందించే దేశాల్లో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఒక పొరుగు దేశంగా ఎల్లప్పుడూ మా బాధ్యతలు పూర్తిగా నిర్వహించాం. మన సహకారానికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేసేలా అడుగులు వేస్తున్నాం.

మాల్దీవుల ప్రజల ప్రాధాన్యాలకు మేం ఎంతో విలువిస్తాం. ఈ క్రమంలోనే ట్రెజరీ బిల్లుల విషయంలో ఉపశమనం కల్పించాం. మీ అవసరాలకు అనుగుణంగా.. 400 మిలియన్ల డాలర్ల, 3 వేల కోట్ల రూపాయల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాం’’ అని మోదీ వెల్లడించారు. అలాగే ఒక ఎయిర్‌ పోర్టు ప్రారంభించామని, 700 హౌసింగ్‌ యూనిట్స్‌ను నిర్మించి ఇచ్చామని చెప్పారు. పోర్టు నిర్మాణానికి మద్దతు ఇవ్వాలనే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

కాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో చేసిన సానుకూల వ్యాఖ్యలతో ఒక రకంగా భారత్, మాల్దీవుల మధ్య గత 10 నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. గతంలో భారత ప్రధానిని, భారత్‌ని తక్కువ చేస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దాంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి ఆ ప్రాంతంలోని అందాల గురించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాంతో ఇండియన్ టూరిస్టులను మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్ వైపు మళ్లించే యోచనలోనే ప్రధాని మోదీ అక్కడ పర్యటించారనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు.. భారత్ వైపు నుంచి ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అనే నినాదం కూడా వైరల్ అయింది. చైనా అనుకూలుడిగా పేరున్న ముయుజ్జు.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తుర్కియే, చైనాల్లో పర్యటించారు. అనంతరం భారత్‌ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలోనే భారత్‌లో ముయిజ్జు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌తో సహా ముయిజ్జు భారత్‌ పర్యటన చేపట్టారు. నాలుగు నెలల్లో ఆయన భారత్‌కు రావడం ఇది రెండోసారి. అయితే.. తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటు ముయిజ్జు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా మొయిజ్జు మాట్లాడిన తీరు ఆ పరిస్థితిని మార్చేసింది.