Chaos at AP - TS Border: హైదరాబాదులో ప్రైవేట్ హాస్టళ్ల మూసివేతతో సొంతూళ్లకు పయనమైన విద్యార్థులు, ఉద్యోగులు. రాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత. హాస్టళ్లు మూయొద్దని నిర్వాహకులకు తెలంగాణ మంత్రుల ఆదేశాలు

మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం సమావేశం ఏర్పరిచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని సూచించారు.....

Hundreds Stranded at AP- TS Border | Twitter Photo

Hyderabad, March 26: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ (Nationwide Lockdown) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు వంటవారు, పనివారు రావడం లేదని హాస్టళ్లను (PGs in Hyderabad Shut) మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హాస్టళ్లలో ఉండే వారందరూ వెంటనే ఖాళీ చేయాలంటూ హుకూం జారీ చేశారు. దీంతో నగరంలోని వివిధ హాస్టళ్లలో 'పేయింగ్ గెస్ట్' లుగా ఉండే విద్యార్థులు, ఉద్యోగులు తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వందల మంది రాష్ట్ర సరిహద్దు వద్దే నిలిచిపోయారు. వారిని ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు (AP- TS Border) వద్ద తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అంతకుముందు వీరంతా తాము సొంతూళ్లకు ప్రయాణించేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణ పోలీసు స్టేషన్ల వద్ద భారీక్యూలు కట్టారు. నగరంలోని పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్ పల్లి, కెపిహెచ్బి, మాదాపూర్, రాయదుర్గం, ఉప్పల్, ఎల్బీ నగర్ మరియు గచ్చిబౌలి సహా నగర శివార్లలోని పోలీసు స్టేషన్ల యువతీయువకులు బుధవారం ఉదయం నుంచే భారీ క్యూలైన్లలో నిల్చుని 'అనుమతి పత్రం' (NOC) పొందారు. అయితే వీరంతా వస్తే కొత్త సమస్యలు వస్తాయని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రంలోకి ప్రవేశించకుండా వీరిని అడ్డుకుంది. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యపై తెలంగాణ మంత్రులు, పోలీసులు చొరవ తీసుకుని ఏపీ మంత్రులు, అధికారులతో మాట్లాడినప్పటికీ వీరి ద్వారా రాష్ట్రంలో కొత్త ఇబ్బందులు తలెత్తుతాయోమోనన్న అనుమానాలు ఏపీ ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేశారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు వారికి అనుమతి లభించింది. కానీ, వీరంతా క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. ఈ క్రమంలో చాలా మంది అందుకు అంగీకరించక, తిరిగి హైదరాబాద్ ప్రయాణం కాగా, మరికొంత మంది అందుకు అంగీకరించి ఏపీలోకి వెళ్లిపోయారు.

హైదరాబాద్ లో హాస్టళ్లు మూసివేస్తున్న నేపథ్యంలో, ఇలా అకస్మాత్తుగా మూసివేయకుండా సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం సమావేశం ఏర్పరిచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.