Masive Fire At Sankarapuram Cracker Store:తమిళనాడులో ఘోర ప్రమాదం, పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం, ఐదుగురు సజీవదహనం, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

Representational Image (Photo Credits: IANS)

Chennai October 26: తమిళనాడులో(Tamilnadu) ఘోర ప్రమాదం జరిగింది. శంకరాపురంలో పటాకుల దుకాణంలో(Cracker Store) అగ్ని ప్రమాదం జరిగి, ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పటాకుల దుకాణం కావడంతో అగ్నికీలలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఓ బేకరీలో గ్యాస్‌ సిలిండర్‌ కూడా పేలిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడుతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగడంతో శంకరాపురం – కల్లకురచి రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

దీపావళి(Diwali) సీజన్ కావడంతో పటాకులు కొనేందుకు వచ్చిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

శంకరాపురం ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు.