IPL Auction 2025 Live

Nirbhaya Case: నిర్భయ దోషులకు మార్చి 03న ఉరి, కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన దిల్లీ పాటియాలా హౌజ్ కోర్ట్, ఇప్పటికైనా తేదీ మార్చకండి అంటూ నిర్భయ తల్లి వేడుకోలు

డెత్ వారెంట్ జారీచేయడం ఇది మూడోసారి అని, న్యాయంకోసం తాము అవిశ్రాంతంగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈసారికైనా మార్చి 03న ఖచ్చితంగా వారిని ఉరితీయాలని వారు కోరుకుంటున్నారు.....

Nirbhaya case convicts | File Image

New Delhi, February 17:  2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో (2012 Delhi Gang rape case) దోషులకు ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. ఆ నలుగురు దోషులను 2020 మార్చి 3న ఉదయం 6 గంటలకు దిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి తీయాలంటూ దిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు సోమవారం సరికొత్తగా డెత్ వారెంట్ (Death Warrant) ను జారీ చేసింది.

కాగా దోషులకు ఇలా డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడోసారి, అయితే ఇదే చివరి సారి అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉరి అమలు రెండుసార్లు వాయిదా పడింది. తొలుత జనవరి 22న, రెండో సారి ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్లు జారీచేయబడ్డాయి. అయితే దోషులు చివరి రోజున రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఆ రెండు సార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.

ఈరోజు విచారణ సందర్భంగా, ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ వాదనలు వినిపిస్తూ దోషులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చట్టపరమైన అభ్యర్థనలు పెండింగ్‌లో లేనందున ఉరిశిక్ష కోసం తేదీని జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ కేసు యొక్క ప్రస్తుత స్థితి మోహన్ కోర్టుకు వివరించారు. అలాగే నలుగురు దోషులలో ముగ్గురు ఇప్పటికే వారికున్న చట్టపరమైన అవకాశాలన్నింటినీ సంపూర్ణంగా వినియోగించుకున్నారని కోర్టుకు తెలియజేశారు. డెత్ వారెంట్ జారీపై కింది కోర్టులకు స్వేచ్ఛ కల్పించిన సుప్రీంకోర్ట్, నిర్భయ దోషులకు నోటీసులు జారీ

ఈ నేపథ్యంలో నిర్భయ కేసులో తిహార్ జైలులో కారాగార శిక్షను అనుభవిస్తున్న నలుగురు దోషులు - ముఖేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31), వీరిని మార్చి 03న ఉదయం 6 గంటలకు ఉరితీయాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. 'నేనొక మానసిక రోగిని, ఉరితీయకూడదు'  నిర్భయ దోషి వినయ్ శర్మ; స్పృహ తప్పిన న్యాయమూర్తి

మరోవైపు నిర్భయ తల్లి ఆశా దేవి మాత్రం ఈ తీర్పుల పట్ల ఎంతమాత్రం సంతోషంగా లేరు. డెత్ వారెంట్ జారీచేయడం ఇది మూడోసారి అని, న్యాయంకోసం తాము అవిశ్రాంతంగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈసారికైనా మార్చి 03న ఖచ్చితంగా వారిని ఉరితీయాలని వారు కోరుకుంటున్నారు.

దేశ రాజధాని దిల్లీలో  2012, డిసెంబర్ 16న రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న నిర్బయపై మొత్తం 6 మంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ, ఇనుప రాడ్లతో ఆమెపై అమానవీయ చర్యలకు పాల్పడ్డారు. ఆ ఆరుగురిని జైలుకు తరలించగా అందులో ఒకరు మైనర్ కావడంతో 3 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చాడు. మరొకరు రామ్ సింగ్ ఒక ఏడాది తర్వాత జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మిగిలిన నలుగురు ఉరిశిక్షను ఎదుర్కోబోతున్నారు.



సంబంధిత వార్తలు