Nipah Virus in Kerala: రంబుటాన్ పండు తినడం వల్లే బాలుడు నిఫా వైరస్ సోకి మరణించాడా, కేరళలో కలవరం పుట్టిస్తున్న నిఫా వైరస్
ఈ వైరస్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. నిఫా వైరస్ సోకి కోజికోడ్‌లో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మరణంతో భయాందోళనలు మరింతగా పెరిగాయి.
Kozhikode, Sep 6: ఇప్పటికే భారీగా వస్తున్న కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను తాజాగా నిఫా వైరస్ (Nipah Virus in Kerala) కలవర పెడుతోంది. ఈ వైరస్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. నిఫా వైరస్ సోకి కోజికోడ్‌లో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మరణంతో భయాందోళనలు మరింతగా పెరిగాయి. దీంతో కేరళకు వెళ్లిన కేంద్ర నిపుణుల బృందం సోమవారం అధికారులు స్వల్ప లక్షణాలు కనిపించిన 8 మంది రక్త నమూనాలతోపాటు ఓ పండును కూడా పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీకి పంపించారు.
నిఫా కలకలంతో ఇప్పటికే కేంద్ర నిపుణుల బృందం..కేరళలో మృతి చెందిన బాలుడి ఇంటికి వెళ్లి (Central team meets boy's family) వారి నుంచి వివరాలు సేకరించింది.ఆ బాలుడి ఆహారపు అలవాట్లు, ఎక్కడెక్కడకు తిరిగాడు. ఎప్పటినుంచి అస్వస్థతకు గురయ్యాడు? అస్వస్థతలో ఎటువంటి లక్షణాలను మీరు గుర్తించారు?వంటి పలు అంశాలపై కుటుంబ సభ్యులను నిపుణుల బృందం ప్రశ్నించింది.ఈ వివరాల్లో మృతుడి కుటుంబ సభ్యులు కొన్ని ఆసక్తికర అనుమానాలను వ్యక్తంచేశారు. మా అబ్బాయి కొన్ని రోజుల క్రితం ఓ పండు తిన్నాడని ఆ పండు తినటం వల్లనే అస్వస్థతకు గురయ్యాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
రంబుటాన్ అనే పండు (Rambutan fruits) తినడం వల్లే ఆ బాలుడికి వైరస్ సోకి ఉండొచ్చని ఆ బాలుడి ఇంట్లోని వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు దీనిని పరీక్షల కోసం పంపించారు. బాలుడి ఇంటి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మొత్తం 188 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించారు. చాతమంగళం పంచాయత్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు.కాగా బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌ల సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు.
ఆ బాలుడిని తల్లిదండ్రులు మొదట స్థానిక క్లినిక్‌కు, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి ఓ మెడికల్ కాలేజీకి, మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ప్రైమరీ కాంటాక్ట్‌లుగానే అనుమానిస్తున్నారు. కాంటాక్ట్‌లను గుర్తించడానికి ఫీల్డ్ వర్కర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. బాలుడికి గత నెల 27న జ్వరం రాగా.. హాస్పిటల్‌లో చేర్చారు.
ఆ రోజు నుంచి ఆ బాలుడు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడన్నదానిపై ఆరోగ్య శాఖ ఓ సవివరమైన రూట్ మ్యాప్‌ను రూపొందించింది. అసలు వైరస్ మళ్లీ ఎక్కడి నుంచి వచ్చిందన్నది చాలా ముఖ్యమని, ఈ బాలుడికే మొదట వచ్చిందా లేదంటే ఎవరి ద్వారా అయినా సోకిందా అన్నదానిని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని వీణా జార్జి అన్నారు. గత మూడేళ్ల క్రితం కేరళలోనే కోజికోడ్ లోనే నిఫా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే.