Farmers Protest Row: కనీస మద్దతు ధరపై రైతులకు హమీ ఇవ్వని కేంద్రం, కిసాన్ ఆందోళన్ 2.0కు రెడీ అవుతున్న రైతు సంఘాలు
ఈ నేపథ్యంలో మరోసారి భారీ ఎత్తున నిరసనలకు (‘కిసాన్ ఆందోళన్ 2.0’) రైతులు సన్నద్ధమవుతున్నారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్ మహాపంచాయత్’ జరిగింది.
New Delhi, Mar 20: పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరోసారి భారీ ఎత్తున నిరసనలకు (‘కిసాన్ ఆందోళన్ 2.0’) రైతులు సన్నద్ధమవుతున్నారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్ మహాపంచాయత్’ జరిగింది. పలు రైతు సంఘాలకు చెందిన అన్నదాతలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం)కు చెందిన 15 మంది ప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమైంది. రైతుల డిమండ్లపై చర్చించింది.
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీపై చట్టం, ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు, గత ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో వాహనంతో రైతులను తొక్కి చంపిన కేసుకు సంబంధించి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యుత్ బిల్లును సవరించాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Here's ANI Tweet
ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఏప్రిల్ 30న ఢిల్లీలో మరోసారి సమావేశమవుతామని రైతు నేత రాకేష్ తికాయిత్ వెల్లడించారు.కేంద్రం నుంచి స్పందన రాకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. దీనికి ముందు అన్ని రైతు సంఘాలు తమ తమ రాష్ట్రాల్లో ర్యాలీలు, కిసాన్ పంచాయతీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.