Northeast Monsoon: చెన్నైలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం, అధికారుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం స్టాలిన్
ఈ రుతుపవనాల రాకతో (Northeast Monsoon) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు (Chennai receives heavy rains) అనేక ప్రాంతాలు నీట మునిగాయి.
Chennai, Nov 1: ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. ఈ రుతుపవనాల రాకతో (Northeast Monsoon) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు (Chennai receives heavy rains) అనేక ప్రాంతాలు నీట మునిగాయి.
వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువరూరు, చెంగల్పట్టు, మైలాదుతురై జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై సహా పొరుగు జిల్లాలైన కాంచీపురం, తిరువరూర్, చెంగల్పట్టు, మైలాదుతురైలోని పాఠశాలలు, కళాశాలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఇక ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈశాన్య రుతుపవనాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న సన్నాహక చర్యలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన మంగళవారం సమావేశం కానున్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొంటారు. భారత వాతావరణ కేంద్రం (IMD) రాబోయే 5 రోజుల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
సోమవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం, పరమకుడిలో 5, 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెంగల్‌పట్టు, నమక్కల్‌లోని కలంబాక్కంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.