Poverty in India: దేశాన్ని కడు పేదరికంలోకి నెట్టేసిన కరోనా, దుర్భర పరిస్థితుల్లో 79 శాతం మంది భారతీయులు, ప్రపంచ బ్యాంకు నివేదికలో దిమ్మతిరిగే నిజాలు
దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా భారత్ ని కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా సమయంలో ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి దొరకక చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు.
New Delhi, Oct 13: కరోనా దెబ్బకి భారత్ విలవిలలాడుతోంది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా భారత్ ని కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా సమయంలో ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి దొరకక చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 10 లక్షల మంది (71 మిలియన్లు) కడు పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు (World Bank Report) నివేదిక వెల్లడించింది. ఇందులో 79 శాతం మంది భారతదేశం నుంచే (Indians Pushed Into Poverty) ఉన్నారని పేర్కొన్నది.
పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ 2022’ పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించింది. దీనిప్రకారం 2020 చివరినాటికి కరోనా కారణంగా దేశంలో 5 కోట్ల 60 లక్షల మంది కడు పేదరికంలోకి వెళ్లారని తెలిపింది. 2019లో 8.4 శాతంగా ఉన్న పేదరికపు రేటు.. 2020 నాటికి 9.3 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. కాగా, అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో పేదరిక స్థాయి పెరిగిందని చెప్పింది.
అయితే ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న చైనాలో పేదల సంఖ్యలో పెద్దగా మార్పేమీ లేదని స్పష్టం చేసింది. కన్జూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే (సీపీహెచ్‌ఎస్) గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కాగా, 2011 నుంచి ప్రభుత్వాలు దేశంలో పేదరికానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించడంలేదు.