Parliament Monsoon Session: మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్, లోకసభ రేపటికి వాయిదా

మణిపూర్ సంక్షోభంపై లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు.విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన (No Confidence Motion) నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు.

Parliament Monsoon Session

New Delhi, July 26:మణిపూర్ సంక్షోభంపై లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు.విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన (No Confidence Motion) నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు. ‘దీనిపై నేను అన్ని పార్టీలతో చర్చిస్తాను. ఆ తర్వాత చర్చకు సమయం ప్రకటిస్తాను’ అని స్పీకర్ వెల్లడించారు.

అవిశ్వాస తీర్మానం అనేది పార్లమెంటరీ ప్రక్రియ, ఇది ప్రభుత్వ మెజారిటీ, పాలించే సామర్థ్యాన్ని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదం పొందినట్లయితే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆగ‌స్టు 11వ తేదీన ముగియ‌నున్న విష‌యం తెలిసిందే. ఇక ఇవాళ లోక్‌స‌భ‌లో విప‌క్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చించేందుకు కేవ‌లం 13 రోజులు(వ‌ర్కింగ్ డేస్‌) మాత్ర‌మే ఉన్నాయి.

మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌కు విన్నపం

అయితే ప‌ద్ధ‌తి ప్ర‌కారం అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చను షెడ్యూల్‌ చేసేందుకు లోక్‌స‌భ స్పీక‌ర్ 10 రోజ‌లు స‌మ‌యాన్ని తీసుకునే వీలుంది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుతో పాటు కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్‌.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. సుమారు 50 మంది ఎంపీలు ఆ నోటీసుల‌పై సంత‌కాలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

మణిపుర్‌ అంశం (Manipur)పై పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా (INDIA)’.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగువేసింది.

రెండో రోజూ సమావేశాల్లో కూడా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్

మణిపుర్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇదే విషయంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో మరోసారి దిగువ సభ వాయిదా పడింది. ఇక రాజ్యసభలో మాట్లాడుతున్న క్రమంలో మైక్‌ కట్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, విపక్షనేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తన ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమేనన్న ఆయన.. ఛైర్మన్‌ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ మైక్‌ కట్‌ చేయడం తనను అవమానించడమేనన్నారు.

బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభమైన తర్వాత మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. పలు అంశాలను సభ దృష్టికి తీసుకువస్తున్నాని చెప్పారు.‘267 కింద 50మంది నోటీసులు ఇచ్చినప్పటికీ పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. కనీసం నేను మాట్లాడేటప్పుడైనా.. అది పూర్తికాకుండానే నా మైక్‌ను ఆఫ్‌ చేశారు. ఇది నా హక్కులకు భంగం కలిగించడమే.

ఇది నాకు అవమానకరమే. వాళ్లు నా ఆత్మగౌరవాన్ని సవాలు చేశారు. ఒకవేళ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సభ నడుస్తుందనుకుంటే.. అది ప్రజాస్వామ్యం కాదనే నేను భావిస్తా’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంగళవారం సభలో చోటుచేసుకున్న వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అధికార పక్షం తీరుపై మల్లికార్జున ఖర్గే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత అలా మాట్లాడిన వెంటనే విపక్షసభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ‘మోదీ మోదీ’ అంటూ ప్రతి నినాదాలు చేయడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో సభను క్రమపద్ధతిలోకి తీసుకురావాలని విపక్షనేత ఖర్గేతో పాటు సభాపక్షనేత పీయూష్‌ గోయల్‌లకు ఛైర్మన్‌ జన్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో ఎగువసభ హోరెత్తిపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.