Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు
ప్రజలను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను వెతుకుతుంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లకు మెసేజులు పంపించడం, కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +371 (లాత్వియా), +375 (బెలారస్), +255 (టాంజానియా) వంటి కోడ్ నంబర్లతో ఫోన్ రింగ్ అవుతోందని, లిఫ్ట్ చేశాక నేరగాళ్లు కాల్ హ్యాంగ్ చేస్తున్నారని, అమాయక యూజర్లు కాల్ బ్యాక్ చేస్తే కేవలం 3 సెకన్లలోనే ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్ కార్డుతో పాటు ఇతర వివరాలను కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
ఇక అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లను ప్రెస్ చేయాలని కోరితే నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పొరపాటున ఈ కోడ్‌లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్ కార్డు యాక్సెస్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు. ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుడిని నేరస్థుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.