PM Modi Addresses The Nation: వలస కూలీలకు భరోసా ఇవ్వండి, కరోనా సమస్యకు లాక్‌డౌన్ పరిష్కారం కానే కాదు, సమష్టిగా పోరాడితేనే సాధ్యం, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి (PM Modi Addresses The Nation) ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో దేశంలో తక్షణమే లాక్‌డౌన్ ఏమీ ఉండదని, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని స్పష్టమైన సందేశమిచ్చారు.
New Delhi, April 21: దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి (PM Modi Addresses The Nation) ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో దేశంలో తక్షణమే లాక్‌డౌన్ ఏమీ ఉండదని, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని స్పష్టమైన సందేశమిచ్చారు. కోవిడ్-19 కోరలు చాస్తున్న వేళ... మహ్మమారిని జయించడం మన చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌కు పోవాల్సిన పనిలేదని అన్నారు. మైక్రో కంటైన్మైంట్ జోన్లకు పరిమితమై, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
కరోనా తొలి వేవ్ నుంచి కోలుకొని దేశం స్థిమితపడుతున్న తరుణంలో సెకండ్ వేవ్ తుఫానులా ( Prevailing COVID-19 Situation) వచ్చింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అదేసమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడం కూడా అత్యవసరం. ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వీయ క్రమశిక్షణ అత్యవసరం. అందరూ కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్ అవసరం ఉండదు. కరోనా కట్టిడికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ మనమంతా సమష్టిగా పోరాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడుకోవాలి’’ అని ప్రధాని మోదీ చెప్పారు.
వలస కార్మికులకు భరోసా కల్పించి వారు స్వస్థలాలకు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కోరారు. వలస కార్మికుల జీవితాలకు, జీవనోపాధికి ఢోకా లేదనే నమ్మకాన్ని రాష్ట్రాలు కల్పించాలన్నారు. వారికి వ్యాక్సినేషన్ హామీ ఇవ్వాలన్నారు. భిన్న రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలందరి భాగస్వామ్యంలో సమష్టిగా పోరాడి మరోసారి కరోనాను కట్టడి చేద్దామన్నారు. ఆక్సిజన్, మందుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని ఫార్మా రంగానికి పిలుపునిచ్చారు.
ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని కోరారు.‘మనమంతా కలిసి పనిచేస్తే కట్టడి ప్రాంతాలు, లాక్‌డౌన్ అవసరమే రాదు. లాక్‌డౌన్‌ను కేవలం చివరి అస్త్రంగానే వాడుకోవాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నా. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మన దృష్టంతా సూక్ష్మ కట్టడి ప్రాంతాలపైనే ఉండాలి. దేశ ప్రజల ఆరోగ్యంతో పాటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడాలి’’ అని మోదీ అన్నారు. ప్రభుత్వాల ప్రయత్నాలన్నీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకేనని చెప్పారు. అదేసమయంలో ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధిపై సాధ్యమైనంత తక్కువ ప్రభావం ఉండేలా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.
గత ఏడాది కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించే సమయానికి మనదగ్గర మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆయుధాలూ లేవని.. మాస్కులు, పీపీఈ కిట్లు వంటి వాటినీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. నాటితో పోల్చితే నేడు కొవిడ్‌పై పోరులో మనమెంతో మెరుగ్గా ఉన్నామన్నారు. చికిత్సలోనూ ఎంతో పురోగతి సాధించామని చెప్పారు. ధైర్యంగా ఉంటేనే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగలమన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో మన దగ్గర మందుల కొరత లేదని మోదీ చెప్పారు. టీకాల తయారీలోనూ మనం సత్తా చాటామని చెప్పారు. కొవిడ్‌పై పోరులో సమర్థంగా పనిచేసిన వైద్యులకు, ఫార్మా సంస్థలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వివరిస్తూ... ఆక్సిజన్, టీకాలు, మందుల ఉత్పత్తిని, సరఫరాను పెంచామన్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వాక్సినేషన్‌కు వీలుకల్పించామన్నారు. ఈ మహమ్మారికి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. దేశం కోవిడ్‌పై పెద్ద సమరమే చేస్తోందన్నారు. తొలిదశ తర్వాత పరిస్థితి కుదుటపడిందని అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ తుపాన్‌లా విరుచుకుపడిందన్నారు. ‘మన ముందున్న సవాల్ చాలా పెద్దది. మన దృఢసంకల్పం, ధైర్యం, సన్నద్ధతతో దీన్ని అధిగమించాలి’ అని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడుకోవాలి. లాక్‌డౌన్‌ను ఆఖరి ఆస్త్రంగా మాత్రమే వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. లాక్‌డౌన్ దాకా పరిస్థితులు రాకుండా చేయగలినంతా చేయాలి. మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలి’ అని ప్రధాని అన్నారు. ఢిల్లీ ఇప్పటికే వారం రోజులు లాక్‌డౌన్‌ను ప్రకటించగా, జార్ఖండ్ 22 నుంచి 29 దాకా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. భారత్‌లో తయారైన రెండు వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టామని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్లను వేసింది భారతదేశమేనన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... అయినా పూర్తి మనోనిబ్బరంతో పోరాడాలన్నారు. దేశప్రజల సమష్టికృషితో కరోనాను జయిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కోవిడ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో ఫార్మా రంగం నిర్విరామంగా శ్రమిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి సంబంధిత వర్గాలు సమష్టిగా కృష్టి చేస్తున్నాయి. కోవిడ్ తొలివేవ్‌లో పీపీటీ కిట్లు, ఇతర సదుపాయాలు లేవు. చికిత్స నిర్దిష్టంగా తెలియదు. వ్యాక్సిన్లు లేవు... అప్పటితో పోలిస్తే ఇప్పుడు కరోనాను సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నాం’ అని ప్రధాని అన్నారు.
ప్రజలందరూ కోవిడ్ జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తే లాక్‌డౌన్‌లతో అవసరం ఉండదన్నారు. అనవసరంగా బయటకు రావొద్దని, వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛభారత్‌లో పెద్దలకు ఆదర్శంగా నిలిచినట్లే... కోవిడ్‌పై పోరులో కూడా చిన్నారులు ముందుండాలన్నారు. ముఖ్యమైన పని లేకుండా ఇళ్లను వదిలి వెళ్లొద్దని తమ తల్లిదండ్రులను, పెద్దలను పిల్లలు ఒప్పించాలన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)