Poonch Terror Attack: ఉగ్రవాదుల దాడిలో అమరులైన 5గురు జవాన్లు వీరే, వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు, దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ
ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్‌ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు.
అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్‌ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్‌ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది.
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్‌కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Here's INDIAN ARMY Tweet
పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు.
పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి.
మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్‌ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు.