PM-WANI: దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై, పీఎండబ్ల్యూఏఎన్‌ఐకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్, మీడియాకు కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్
ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) అన్నారు.
New Delhi, December 9: దేశంలో భారీ ఎత్తున పబ్లిక్ వైఫై (Public Wi-Fi System) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) అన్నారు. దేశ వ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్)కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన వివరాలపై మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. పీఎండబ్ల్యూఏఎన్‌ఐని (PMWANI) ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుందని అన్నారు. కొచ్చి- లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు ఆమోదం తెలిపిందని రవిశంకర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు.
అంతేగాక ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 58.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. పబ్లిక్ వై ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్ ఫేస్‌ను పీఎం-వాణి (PM-WANI)గా పిలువనున్నారు. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ప్రోత్సహించడమే ఈ ప్రతిపాదన లక్ష్యమని కేబినెట్ పేర్కొంది.